Friday, April 26, 2024
- Advertisement -

ఏపీలో కమ్మ కాపు రెడ్డి మూడు ముక్కలాట

- Advertisement -

నరేంద్రమోడీపై కసితో రగిలిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఏపీలో ప్రతి ఎంపీ స్థానాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. 25 ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. నరేంద్రమోడీని రెండోసారి ప్రధానిగా చేయకూడదనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ఈ సారి ఎంపీ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 25 ఎంపీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని కేంద్రంలో చక్రం తిప్పాలన్నది ఆయన అభిలాష. ఎన్డీఏ కూటమిలో దశాబ్దాల నుంచీ భాగస్వామి అయిన చంద్రబాబును తొక్కేసేందుకు ఏపీకి ప్రత్యేకహోదా, నిధులు ఇవ్వకుండా మోడీ అవమానించారని చంద్రబాబు ఇటీవల కాలంలో నిప్పులు చెరుగుతున్నారు. మోడీ కంటే సీనియర్ నైన తాను అనేకసార్లు ఢిల్లీ వెళ్లి లెక్కలేనన్ని వినతిపత్రాలు ఇచ్చినా, అడ్డగోలుగా విభజించిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని విన్నవించుకున్నా పట్టించుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ మెజార్టీ వచ్చిందనే అహంకారంతో ప్రత్యేకహోదా ఇవ్వకుండా మిత్రపక్షమైన టీడీపీని అవమానించారని మండిపడుతున్నారు. వచ్చేసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బొటాబొటి మెజార్టీ వస్తే ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీ కచ్చితంగా ఉండకుండా చేయాలని కాంగ్రెస్, టీడీపీ సహా దేశంలోని బీజేపీ, మోడీ వ్యతిరేక శక్తులు, పార్టీలు అన్నీ కృషి చేస్తున్నాయి. యూపీఏ అభ్యర్ధి లేదా ఇతరులు ఎవరైనా ప్రధాని అయినా ఫర్వాలేదు కానీ మోడీ మాత్రం కాకూడదన్నది మోడీ వ్యతిరేకుల ఏకైక లక్ష్యం. బీజేపీ నుంచి ఇంక ఏ ఇతర సీనియర్ నేత అయినా ఫర్వాలేదు కానీ మోడీ మాత్రం కాకూడదన్నదే వారి ధ్యేయం. అందుకే ఇప్పటికే కాంగ్రెస్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సహా ఇతర జాతీయ పార్టీలు నాయకలతో చర్చలు జరిపిన చంద్రబాబు ఈ సారి ఏపీలో వీలైనన్ని ఎంపీ స్థానాలు గెల్చుకుని మోడీకి వ్యతిరేకంగా కేంద్రంలో చక్రం తిప్పాలనే కసితో రగిలిపోతున్నారు.

అయితే ఈ సారి ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ తో పాటు జనసేన కూడా బరిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. జనసేన గెలవలేకపోయినా గెలుపుని ప్రభావితం చేసే చాన్స్ ఉంది. ఈ మూడు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మూడు ప్రధాన సామాజికవర్గాలకు చెందినవాళ్లు. కమ్మ రెడ్డి కాపు సామాజిక వర్గాలకు చెందిన వీళ్లు బయటకు ఏం చెప్పినా, తెరవెనుక మాత్రం తమ సామాజిక వర్గం నేతలంతా తమవైపే ఉండేలా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేక సంకేతాలు వెళ్లకుండా సామాజిక న్యాయం సూత్రం పాటిస్తున్నట్లు సందేశం ఇస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుల సమీకరణాలు తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకుండా, కాపు రెడ్డి కుల నాయకుల ఎంపిక ద్వారా వారి ఓట్లు రాబట్టుకోవాలనే యోచనలో ఉన్నారు. కాపు కమ్మ రెడ్డి ఈ మూడు కులాలకు చెందిన ఏ నేతను ఎంపీ అభ్యర్ధిగా ఎక్కడ నుంచి నిలిపినా మిగిలిన రెండు సామాజిక వర్గాల నేతలు కార్యకర్తలు పూర్తి మద్దతు ఇచ్చేలా ఇప్పటి నుంచే చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, కర్నూలు నుంచి బుట్టా రేణుక, శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ఎంపీలుగా పోటీ దాదాపు ఖాయమైపోయినట్టే. ఈ 4 సీట్లు మినహా మిగిలిన 21 స్థానాల్లో టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు. ఆయా స్థానాల్లో సిట్టింగ్ స్థానాలు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, నర్సరావు పేట నుంచి రాయపాటి సాంబశివరావు సిట్టింగ్ స్థానాల్లో మార్పు తప్పకపోవచ్చు. టీడీపీ కమ్మవారి పార్టీ అనే ప్రచారం ఈ మధ్య పెరిగిపోతుండటంతో ఆ సామాజిక వర్గం నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎంపీ స్థానానికి మంత్రి గంటా శ్రీనివాసరావుని పోటీ చేయాలని బాబు సూచిస్తున్నా గంటా మాత్రం ఎమ్మెల్యేగానే బరిలో దిగాలని భావిస్తున్నారు. వీటితో పాటు మిగిలిన ఎంపీ స్థానాలపైనా చంద్రబాబు తీవ్ర కసర్తు చేసి, కచ్చితంగా గెలుస్తారు…అనే నమ్మకం కలిగితేనే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. బలమైన ఎంపీ అభ్యర్ధిని బరిలో దించడం ద్వారా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాల్లోనూ సత్తా చాటాలన్నది చంద్రబాబు వ్యూహం. మరి ఆయన వ్యూహరచన ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -