Saturday, April 27, 2024
- Advertisement -

క‌డ‌ప జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు

- Advertisement -

కాదేది బెట్టింగ్‌ల‌కు అన‌ర్హం… అన్న‌ట్టు ఉంది బెట్టింగ్ రాయుళ్ల వ్య‌వ‌హ‌రం. ఇప్ప‌టివ‌ర‌కు క్రికెట్, కోడి పందేలాపై బెట్టింగ్‌లు చూశాం. ఈ మ‌ధ్య ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌రిగిన బెట్టింగ్‌ల్లో కోట్ల రూపాయ‌లు చేతులు మారిన‌ట్టు స‌మాచారం. కానీ వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు ఒక అడుగు ముందుకు వేశారు. ఎన్నిక‌ల్లో ఎవ‌రూ పోటీ చేస్తార‌న్న విష‌యంపై బెట్టింగ్‌లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ధాన పార్టీల్లో ప‌లానా అభ్య‌ర్థికే టికెట్ వ‌స్తుందంటూ కోట్ల‌లో బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నారు.

ముఖ్యంగా రాజంపేట‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌మ‌ళాపురం నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల విష‌యంలో కోట్ల‌లో బెట్టింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం అక్క‌డ హాట్ టాపిక్‌. మొన్న‌టివ‌ర‌కు రాజంపేట టికెట్‌ను వైఎస్ఆర్‌సీపీ… అమ‌ర్నాథ్ రెడ్డికే ఇస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ అనూహ్యంగా మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి ఎంట్రీతో స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. ఇద్ద‌రూ రెడ్డి సామాజిక వ‌ర్గ‌మే కావ‌డంతో ఇప్పుడు ఎవ‌రికి టికెట్ కేటాయిస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. మేడా కూడా ఇప్ప‌టికే జ‌గ‌న్ వ‌ద్ద త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. పార్టీలో చేరే సంద‌ర్భంగా త‌న అనుచ‌రుల‌తో రాజంపేట నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే మేడా వైపే జ‌గ‌న్ మొగ్గు చూపుతార‌ని ఓ వ‌ర్గం వాద‌న‌. కానీ ముందునుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న అమ‌ర్నాథ్ రెడ్డికి అన్యాయం చేయ‌ర‌ని మ‌రో వ‌ర్గం వాద‌న‌. ఈ వాద‌న‌లే పెట్టుబ‌డిగా ఇప్పుడు బెట్టింగ్ నిర్వాహ‌కులు బ‌రిలోకి దూకారు. టికెట్ ఎవ‌రికి కేటాయిస్తారో అంటూ బెట్టింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇక రాజంపేట టీడీపీ అభ్య‌ర్థిపై అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు బెట్టింగ్ రాయుళ్లు. ఈ సీటు ఇప్ప‌టికే బ‌లిజ సామాజిక వర్గానికి చెందిన చెంగ‌ల్‌రాయుడుకి కేటాయించిన‌ట్టు స‌మాచారం. మేడా టీడీపీని వీడటం.. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ‌, క్ష‌త్రియ సామాజిక వ‌ర్గాల‌కే ఎక్కువ ప‌ట్టు ఉండ‌టంతో చంద్ర‌బాబు చెంగ‌ల్‌రాయుడువైపే మొగ్గు చూపుతున్నార‌ని సమాచారం. దీంతో టీడీపీ అభ్య‌ర్థిపై క్లారిటీ రావ‌డంతో బెట్టింగ్ రాయుళ్లు ఈ ప‌క్క చూడ‌టం లేదు.

ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ అభ్య‌ర్థి విష‌యంలో కూడా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. 2014 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచి… టీడీపీ తీర్థం తీసుకున్న ఆదినారాయ‌ణ రెడ్డికి మ‌రోసారి టికెట్ ఇస్తారా? లేక ఎప్ప‌టి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రామ‌సుబ్బారెడ్డికి టికెట్ కేటాయిస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఆనాడు ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలో చేర‌డంపై రామ‌సుబ్బారెడ్డి బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. 2019 ఎన్నిక‌ల్లో త‌న సీటుకు ఆదినారాయ‌ణ రెడ్డి ఎక్క‌డ ఎస‌రు పెడ‌తారో అనేది ఆయ‌న భ‌యం. అందుకే ఆయ‌న ముందు నుంచే ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ని స‌మాచారం. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి దాదాపు ఖ‌రారైన‌ట్టే. ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీ ఫిరాయించిన కొద్ది కాలానికే.. సుధీర్ రెడ్డి వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం.. త‌రువాతి ఎన్నిక‌ల్లో సీటు ఇస్తాన‌ని అభ‌య‌మివ్వ‌డం జ‌రిగిపోయింద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఓ సారి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌దే ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. మ‌రి చంద్ర‌బాబు ఎవ‌రివైపు మొగ్గు చూపుతార‌న్న‌దే ప్ర‌శ్న‌.

ఇక క‌మ‌ళాపురం వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థిగా ఈ సారి కూడా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మామా ర‌వీంద్ర‌నాథ్ రెడ్డికే క‌న్‌ఫామ్‌. మ‌రి టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే క‌మ‌ళాపురం టికెట్ కోసం పుట్టా న‌ర‌సింహ‌రెడ్డి, వీర‌శివారెడ్డి పోటీ ప‌డుతున్నారు. మ‌రి టీడీపీ అధినేత ఎవ‌రి వైపు మొగ్గు చూపుతార‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

ఇలా స‌స్పెన్స్‌లో ఉన్న‌ అభ్య‌ర్థుల భ‌విత‌వ్యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని కోట్ల‌లో బెట్టింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు నిర్వాహ‌కులు. కాయ్ రాజా కాయ్‌.. అంటూ ప్ర‌స్తుతానికైతే క‌డ‌ప జిల్లాలో కోట్ల‌లో బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయ‌నేది స‌మాచారం. ఇక త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి త‌మ‌కున్న రాజ‌కీయ ప‌రిచ‌యాలతో ప‌లానా అభ్య‌ర్థికే టికెట్ వస్తుందంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. టికెట్ వ‌స్తుందో రాదో అని అస‌లు అభ్య‌ర్థుల క‌న్నా ఈ బెట్టింగ్ రాయుళ్లే ఎక్క‌వు టెన్ష‌న్‌లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -