కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సీ,డీ గ్రేట్ పోస్టుల్లో 100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే దక్కుతాయని ప్రకటన చేశారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ 2024ను కేబినెట్ అమోదించిందని తెలిపారు.
అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం వివక్ష పూరితంగా ఉందని పలువురు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు అమలైతే రాష్ట్రం నుండి కంపెనీలు తరలిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే టెక్ హబ్ గా ఉన్న బెంగళూరులో నైపుణ్యం కలిగిన వారి అవసరం ఎంతో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వద్దని..కంపెనీ నిర్వాహకుల అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పారు కర్ణాటక మంత్రి సంతోష్. ఒకవేళ స్థానికంగా తగిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరక్కపోతే ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చని వివరించారు. ప్రైవేటు కంపెనీల్లోని కిందిస్థాయి ఉద్యోగాలు ఎక్కువగా కర్ణాటకలో స్థిరపడిన ఉత్తరాది రాష్ట్రాల వారు దక్కించుకుంటున్నారని అందుకే ఈ బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఏం వెలువడలేదు.
