పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను రోడ్లపై నడిపిస్తూ తీసుకువెళ్లే చర్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “పోలీసులు ఇలా ఎలా ప్రవర్తించగలరు?” అంటూ కోర్టు ప్రశ్నించింది.
ఈ పిల్‌ను దాఖలు చేసిన పిటిషనర్, నిందితులను ప్రజల ముందే రోడ్లపై నడిపిస్తూ తీసుకువెళ్లిన ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ తరహా చర్యలు నిందితుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని, ఇవన్నీ చట్టవిరుద్ధమైన చర్యలేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది, కొవ్వూరు ప్రాంతంలో ఓ నిందితుడిని తీసుకువెళ్తున్న వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో అతడిని రోడ్డుపై నడిపిస్తూ తీసుకువెళ్లాల్సి వచ్చిందని, అప్పుడే కొందరు ఫోటోలు తీశారని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వివరణపై న్యాయస్థానం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదు.
కొన్ని వీడియోలలో పోలీసులు ఇష్టారీతిన దూషిస్తూ, దురుసుగా వ్యవహరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు బాధ్యతాయుతంగా, చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. పోలీసు శాఖ ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించింది.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
