- Advertisement -

హనీ ట్రాప్…లెడీడాన్ అరెస్ట్!

- Advertisement -

అనంతపురం జిల్లాలో గత కొంతకాలంగా సాగుతున్న భారీ హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహిళలను ఎరగా వేసి అమాయకులను బుట్టలో పడేసి, వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ఈ ముఠా ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలక సూత్రధారి, లేడీడాన్ గా పిలవబడే రంగమ్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రంగమ్మ నేతృత్వంలోని ఈ ముఠా ఒక పక్కా స్కెచ్ ప్రకారం పనిచేసేది.అందమైన మహిళలను ఎరగా వేసి సంపన్నులను, అమాయకులను ఆకర్షించేవారు.బాధితులు మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టేవారు.

పరువు పోతుందనే భయంతో బాధితులు అడిగినంత ఇచ్చేవారు. ఈ క్రమంలో ఈ ముఠా ఇప్పటివరకు సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ నేరగాళ్లకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే సహకరించడం. బాధితులు ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, కొందరు అధికారులు ముఠాకే వత్తాసు పలికారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్ (VR) కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 8 మంది కానిస్టేబుళ్లు ఈ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరి పాత్రపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ముఠాకు చెందిన మరో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంగమ్మకు సహకరించిన వారు ఎవరు? ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -