కర్ణాటక రాజధాని బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పట్టపగలే ఒక భయంకరమైన హత్యాయత్నం జరిగింది. విడిపోయిన భార్యపై ఉన్న ద్వేషంతో సంజయ్ అనే వ్యక్తి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు తన వ్యక్తిగత పనిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా.. నిందితుడు సంజయ్ స్కూటీపై ఆమెను వెంబడించాడు. ఎవరూ ఊహించని విధంగా ఆమెకు ఎదురుగా వచ్చి స్కూటీ ఆపి, వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడికి దిగాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వదలకుండా వెంటాడి కత్తితో పొడవసాగాడు.
రోడ్డుపై జరుగుతున్న ఈ దారుణాన్ని చూసిన స్థానికులు తొలుత షాక్‌కు గురైనప్పటికీ, వెంటనే తేరుకున్నారు. నిందితుడు సంజయ్‌ను చుట్టుముట్టి, అతని చేతిలోని కత్తిని లాక్కుని అడ్డుకున్నారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు ఎంత క్రూరంగా దాడి చేశాడో ఆ విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
నడిరోడ్డుపై మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
