కృష్ణా జిల్లా గూడూరులో అధికార పార్టీ నేత రెచ్చిపోయారు. అప్పుగా మద్యం ఇవ్వలేదన్న నెపంతో ఒక వైన్ షాపు నిర్వాహకుడిపై టీడీపీ నేత, తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘోరం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
గూడూరులోని రాయల్ వైన్స్ వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. షాపు నిర్వాహకుడు చిలంకుర్తి అశోక్ వద్దకు వచ్చిన కొందరు యువకులు అప్పుగా బీర్లు ఇవ్వాలని కోరారు. అయితే, అప్పు ఇవ్వడం కుదరదని అశోక్ తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన సదరు యువకులు, వేరే షాపు నుంచి బీర్లు తెచ్చుకుని మరీ అదే రాయల్ వైన్స్ ఎదుట కూర్చుని తాగేందుకు ప్రయత్నించారు. తమ షాపు ముందు మద్యం తాగవద్దని, అక్కడ గొడవ చేయవద్దని అశోక్ వారిని వారించారు.
ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత పోతన స్వామినాయుడు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. తన మాట వినలేదన్న కోపంతో అశోక్ పై దాడికి దిగారు.
ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ, వారు చూస్తుండగానే ఈ దాడి జరగడం గమనార్హం. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు అడ్డుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ దాడిలో చిలంకుర్తి అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను వెంటనే విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
