సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party) అకౌంట్ బ్లాకింగ్ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. జాతీయ భద్రత పేరుతో తన ‘X’ (ట్విట్టర్) అకౌంట్‌ను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఐటీ శాఖకు అలాగే ‘X’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యంగ్య వ్యాఖ్యలు, రాజకీయ సెటైర్లు ప్రజాస్వామ్యంలో భాగమని, అలాంటి అకౌంట్లపై చర్యలు తీసుకునేటప్పుడు స్పష్టమైన కారణాలు అవసరమని అభిప్రాయపడింది.
అభిజీత్ దిప్కే తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదిస్తూ.. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అకౌంట్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. జాతీయ భద్రత అనే సాధారణ కారణాన్ని చూపించి అకౌంట్ నిలిపివేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు…బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష నిర్వహించాలని ఐటీ శాఖకి ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
