కన్నతండ్రిని తల్లి, పిల్లలు కలిసి అత్యంత అమానుషంగా హతమార్చి.. శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో దాచిన ఏడేళ్ల నాటి అత్యంత కిరాతకమైన మల్కాజిగిరి మర్డర్ మిస్టరీలో మల్కాజిగిరి జిల్లా కోర్టు చారిత్రాత్మక సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. నేర తీవ్రతను బట్టి అరుదైన శిక్షలను ఖరారు చేసింది. హత్యకు పూర్తి సలహాలు ఇచ్చి సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు (యావజ్జీవ కారాగార శిక్ష) విధిస్తూ.. కన్నతండ్రిని స్వహస్తాలతో అత్యంత క్రూరంగా చంపిన కొడుకు, కూతురు ఇద్దరికీ ఉరిశిక్ష (మరణశిక్ష) విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
పోలీసుల రికార్డుల ప్రకారం.. 2019 ఆగస్టు నెలలో మల్కాజిగిరి పరిధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన 70 ఏళ్ల మారుతి సీతార్ దారుణ హత్యకు గురయ్యారు. అతని పేరిట వచ్చే పెన్షన్ డబ్బులు, రిటైర్మెంట్ సొమ్మును ఎలాగైనా దక్కించుకోవాలనే స్వార్థంతో అతని కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురు కలిసి ఇంట్లోనే ఒక భయంకరమైన స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం మారుతి సీతార్‌ను ముగ్గురు కలిసి కిరాతకంగా చంపేసారు. అంతటితో ఆగకుండా.. ఈ ఘోరం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ భయంకరమైన శరీర భాగాలను ఆరు వేర్వేరు బకెట్లలో కుక్కి ఇల్లానే నిల్వ చేశారు.
ఈ దారుణం బయటపడిన నాటి నుండి పోలీసులు క్లూస్ టీమ్, శాస్త్రీయ ఆధారాల సహాయంతో పక్కాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఏడేళ్ల పాటు కోర్టులో సాగిన సుదీర్ఘ విచారణ మరియు సాక్ష్యాధారాల పరిశీలన తర్వాత.. ఈరోజు కోర్టు హంతకులకు గట్టి గుణపాఠం చెబుతూ సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. కేవలం పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రిని, నవమాసాలు మోసి పెంచిన తల్లితో కలిసే నరికి చంపడం.. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు సమాజంలో నానాటికి ఎంత దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఉదాహరణ.
తల్లిదండ్రులు పిల్లలను కేవలం డబ్బు, లగ్జరీ వస్తువులతో మాత్రమే కాకుండా.. మంచి నైతిక విలువలతో పెంచడం ఎంత అవసరమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. కేవలం డబ్బు సంపాదనలోనే మునిగిపోకుండా.. మీ పిల్లలతో కచ్చితంగా కొంత సమయాన్ని గడపండి. వారికి మానవ సంబంధాల విలువను, పెద్దలను గౌరవించే సంస్కారాన్ని నేర్పించడం నేటి తరం తల్లిదండ్రుల కనీస బాధ్యత.
