తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ హైకమాండ్ మార్గదర్శకం మేరకు బండి సంజయ్ – ఈటెల రాజేందర్ రాజీ పడ్డారు. పార్టీ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పాటిల్ ముందుగా ఇద్దరితో వేర్వేరుగా సమావేశం నిర్వ హించారు. తరువాత ఇద్దరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేసారు. అందులో పార్టీ వైఖరి తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. దీంతో, ఇద్దరూ ఇక కలిసి పని చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ఈ సారి ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. దక్షిణాది పైన గురి పెట్టిన బీజేపీ.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ముందుగా నేతల మధ్య సమన్వయం లేకపోవటంతో సరి చేసే ప్రక్రియ చేపట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పటేల్ ఈ మేరకు ఆపరేషన్ ప్రారంభించారు. కీలక నేతలు బండి సంజయ్ – ఈటెల రాజేందర్ మధ్య ఉన్న అభిప్రాయ బేధాల పైన చర్చించారు. తొలుత ఒన్ టు ఒన్ సమావేశం నిర్వహించి.. ఇద్దరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని స్పష్టం చేసారు. పార్టీ ఆదేశాలు అమలు చేయాలని నిర్దేశించారు. ఆ తరువాత సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో భేటీ అయ్యారు. ఇద్దరి నేతలతో ఒకే సారి మాట్లాడారు.
లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఇరు నేతలు తమ అభిప్రాయాలను, అభ్యంతరా లను పంచుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని మరింత అధికార దిశగా తీసుకెళ్లడానికి, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఇద్దరం కలిసికట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. బండి సంజయ్ – ఈటెల రాజేందర్ కలిసి మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. పార్టీ కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రం లో బీజేపీని అధికారంలోకి తేవటమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు.
