తమిళనాడులో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విశాల్ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, ఆయన వ్యాఖ్యలపై విశాల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలోని నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, యూట్యూబర్ల నీచమైన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌తో తనకున్న అనుబంధం గురించి విశాల్ మాట్లాడుతూ.. ‘‘మా స్నేహం ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో నేను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చినా సరే.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు రావు. అలాగే మా మధ్య ఎలాంటి తీవ్రమైన దూషణలు ఉండవు. ఈ విషయాన్ని నేను బహిరంగంగా అంగీకరిస్తున్నాను. గతంలో ఒక సినిమా విషయంలో నేను అనుభవించిన వ్యక్తిగత బాధ వల్ల అతడి నిర్మాణ సంస్థ గురించి కాస్త కోపంగా మాట్లాడాను. కానీ, నిజానికి ఉదయనిధి చాలా మంచి వ్యక్తి’’ అని విశాల్ స్పష్టం చేశారు.
మరోవైపు నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన అరెస్టయిన వైనంపై విశాల్ స్పందిస్తూ యూట్యూబర్ల తీరును తప్పుబట్టారు. ‘‘నా స్నేహితుడు ఉదయనిధి ఏదో మాట్లాడాడు, వెంటనే అరెస్టయ్యాడు. అయితే, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీనటులు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై నీచంగా మాట్లాడే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఛానెళ్ల సంగతేంటి? మొహం కనిపించకుండా తెర వెనుక ఉండి అలా మాట్లాడేవాళ్లను.. ధైర్యంగా తెర ముందుకు వచ్చి ఇదే విషయం ముఖం మీద చెప్పమని అడగండి. వాళ్లు ఎప్పటికీ అలా చెప్పరు. ఎందుకంటే అలా చేస్తే వాళ్లకు డబ్బులు రావు’’ అని మండిపడ్డారు.
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు విశాల్ ఒక విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులపై యూట్యూబ్‌లో అసభ్యకరంగా, నీచంగా మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు కూతలు కూస్తూ ఇండస్ట్రీ ప్రముఖుల పరువు తీస్తున్న వారందరికీ తగిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ను విశాల్ కోరారు.
