జనసేన అధినేత పవన్ తన రాజకీయ యాత్రను ప్రకటించారు. 2009 కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రమాదం నుంచి బయటపడిన పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి దయవల్లే బ్రతికానని తెలిపారు. అందుకే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ చేసిన అనంతరం తన రాజకీయ యాత్ర వివరాలను పవన్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వరలోనే తమ పార్టీలో చేరుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై తాము విస్తృతంగా చర్చ జరుపుతామని అన్నారు. తెలంగాణలోనూ పర్యటించాలని, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని తన అభిమానులు అడుగుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణాలో ఉన్న సమస్యల మీద జనసేన బృందాలు పని చేస్తున్నాయన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి సలహాలు, సూచనలు అందిస్తామన్నారు.
ఓటుకు నోటు వచ్చినప్పుడు తాను స్పందించలేదని, ఆ పని తప్పు అని తనకు తెలుసని, కానీ బాధ్యతతో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. అన్ని పార్టీలు విమర్శలు చేశాయని, తానొక మాట అని సమస్యపై మరింత రచ్చ చేయకుండా ఆచి తూచి వ్యవహరించాలని ఆలోచించానని పవన్ తెలిపారు. అందుకే ఆ విషయంపై స్పందించలేదని చెప్పుకొచ్చారు. రాజకీయపరంగా ఎవ్వరికీ లబ్ది చేకూర్చే పనులు తాను చేయనని అన్నారు. తన ప్రతి అడుగు నిర్మాణాత్మకంగానే ఉంటుందని తెలిపారు. ఏపీలో కులాల సమస్య ఉందని అన్నారు.
