భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్నిపరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి కేరళకు వెళ్లారు. భారీ వర్షాల కారనంగా భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు.
గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న దక్షిణాది రాష్ట్రంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రధాని.. కేరళ సీఎం, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఏరియల్ సర్వేలో ప్రధానితోపాటు పాల్గొన్నారు.
#WATCH: Prime Minister Narendra Modi conducts an aerial survey of flood affected areas. PM has announced an ex-gratia of Rs. 2 lakh per person to the next kin of the deceased and Rs.50,000 to those seriously injured, from PM’s National Relief Funds (PMNRF). #KeralaFloods pic.twitter.com/T6FYNVLmMu
— ANI (@ANI) August 18, 2018
అంతకుముందు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సర్వే చేసేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని క్షణాల్లోనే కిందకు దిగిపోయింది. దీంతో ప్రధాని మోడీ కేరళ సీఎం పినరయి విజయన్, రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్‌లతో కలిసి నిర్వహించాల్సిన ఏరియల్ సర్వేలో పాల్గొనలేకపోయారు.
కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ప్రధాని తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రధాన మోదీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళలో ఎరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రూ.100 కోట్ల మేర తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.
కేరళలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు సంభవించాయి. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 385 మందికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం గత రెండ్రోజుల్లోనే 150మంది చనిపోయినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా మారింది.
కేరళను ఆదుకోవడానికి తోటి రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ సర్కారు రూ.25 కోట్ల విరాళం ప్రకటించగా.. ఆంధ్ర ప్రదేశ్ రూ.10 కోట్లు సాయంగా ప్రకటించింది. నీటిని శుద్ది చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషీన్లను కేసీఆర్ సర్కారు కేరళకు పంపుతోంది. చిన్న పిల్లల కోసం రూ.55 లక్షల విలువైన ‘బాలమృతం’ను కూడా బేగంపేట నుంచి కేరళ పంపారు.
