ఆటో మితిమీరిన వేగం కారనంగా ఓ చిన్నారి బలి అయ్యింది.వే గంగా వస్తున్న ఆటో అదుపు తప్పి పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ కుటుంబాన్ని ఢీకొట్టడంతో ఓ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ సంఘటన ఉప్పల్ సమీపంలోని రామంతాపూర్లో చోటు చేసుకుంది.
రామాంతపూర్ లో నివసించే ఉమేశ్ తన భార్యా,పిల్లలతో కలసి నిన్న షాపింగ్ కు బయలుదేరాడు. కుమారుడు మోహిత్(5)తో కలసి ఉమేశ్ ముందు నడస్తుండగా, భార్య, రెండో కుమారుడు వెనుక వస్తున్నారు. ఇంతలో ఎదురుగా రోడ్డుపై ఓ ఆటో వేగంగా వచ్చింది. అయితే రోడ్డుపై వెళుతున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కకు కట్ చేయడంతో ఒక్కసారిగా ఆటో వీరిపైకి దూసుకొచ్చింది. పక్కకు ఒరిగిపోతూ ఉమేశ్, మోహిత్ లను ఢీకొట్టింది. ఆటో బలంగా తగలడంతో ఉమేశ్ అల్లంతదూరం ఎరిగిపడగా, మోహిత్ ఆటోకు, ఫుట్ పాత్ కు మధ్య నలిగిపోయాడు. దీంతో ఘటనాస్థలంలోనే పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.
అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వారి ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అయ్యోపాపం అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
