Friday, April 26, 2024
- Advertisement -

భీమ్లానాయక్ సినిమా ఎలా ఉందంటే ?

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్’ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘భీమ్లా నాయ‌క్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. వకీల్ సాబ్ హిట్ తో బాక్సాఫీసు బద్ధలు కొట్టిన పవర్ స్టార్.. ఈ ఏడాది భీమ్లా నాయక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌ అయినా.. పవన్, రానా నటించడంతో ముందునుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక త్రివిక్రమ్‌ ఎస్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడంతో అభిమానుల్లో మరింత క్రేజ్ నెలకొంది. మరి భీమ్లా నాయ‌క్ సినిమా అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం.

భీమ్లా నాయక్‌ (పవన్‌కల్యాణ్‌) ఆంధ్రపద్రేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పోస్ట్ అవుతాడు. అదే ఊళ్లో డానియల్‌ శేఖర్‌ (రానా దగ్గుబాటి) ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి డానియల్‌ అయితే.. నిజాయితీకి మారుపేరైన పోలీస్ ఆఫీసర్‌గా నాయక్‌ ఉంటాడు. డానియల్‌ ఓ రోజు మద్యం సీసాలతో అడవిలో వెళుతుండగా.. నాయక్‌ చేతికి చిక్కుతాడు. డానియల్‌ను నాయక్‌ కొట్టి స్టేషన్‌కు పంపడంతో అతడి ఇగో దెబ్బతింటుంది. బెయిల్ మీద వ‌చ్చాక నీ క‌థ చూస్తా అంటూ నాయక్‌కు వార్నింగ్ ఇస్తాడు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు తారా స్థాయికి వెళతాయి. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? డానియల్‌ సతీమణికి నాయక్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే. ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఒరిజిన‌ల్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ కథ. అదే లైన్‌ను ‘అహంకారానికి– ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్థం’ అంటూ ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం ట్రైలర్‌లో తెలిపారు. ప్రీ రిలీజ్‌ వేడుకలోనూ వెల్లడించారు. ఇందులో అహంకారంతో ప్రతీకారం తీర్చుకునే బలమైన వ్యక్తిగా రానా, ఆత్మగౌరవం గల పోలీస్‌గా పవన్‌కల్యాణ్‌ కనిపించారు. ఇద్దరు స్టార్‌డమ్‌ ఉన్న హీరోలను ఒకే సినిమాలో బ్యాలెన్స్‌ చేస్తు చూపించడం కత్తి మీద సాము లాంటిదే ఈ విషయంలో దర్శకుడు సాగర్‌ కె.చంద్ర సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

మలయాళంలో బిజూ మీన‌న్ పోషించిన పాత్రలో ప‌వ‌న్ కళ్యాణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను రానా పోషించారు. మలయాళంలో పృథ్వీ పాత్ర చుట్టూ ఎక్కువ క‌థ తిరుగగా.. తెలుగులో నాయ‌క్ పాత్ర చుట్టూ క‌థ నడవడం విశేషం. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం దాదాపు మూడు గంట‌ల పాటు ఉండగా.. తెలుగులో క‌థ‌లో కొన్ని మార్పులు చేసి ఓ అర‌గంట నిడివిని త‌గ్గించారు. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. భీమ్లానాయక్‌ చూసిన తర్వాత ఆ పాత్రలో పవన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమే. పవన్‌కు దీటుగా రానా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. భీమ్లా నాయక్‌ భార్య సుగుణగా నిత్యా మేనన్‌.. డానియల్‌ భార్యగా సంయుక్త మేనన్‌ పర్వాలేదనిపించారు. సీఐ కోదండరాంగా మురళీ శర్మ, డానియల్‌ తండ్రిగా సముద్రఖని తమ పరిధి మేరకు నటించారు.

బ్రహ్మానందం కూడా మెరిశారు. తమన్‌ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేప‌థ్య సంగీతంతో ఆరగొట్టాడు. ప్రథమార్ధంతో పోలిస్తే.. ద్వితీయార్ధంలో నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాకు యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. అడవి గురించి, మనుషుల మధ్య బంధాల గురించి త్రివిక్రమ్‌ రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి భీమ్లా నాయ‌క్ ఒరిజిన‌ల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ కంటే బాగుంద‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -