గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న హనీ ట్రాప్ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారులు మరియు నిందితులు అధికార పార్టీలకు చెందిన నేతలు కావడంతో రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో నిందితుల జాబితాను చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
ఈ మొత్తం వ్యవహారం టీడీపీ నేత దబ్బర రాజేష్ నాయుడు కనుసన్నల్లోనే జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కుట్రకు ఆయనే మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారని సమాచారం.ఈ కేసులో మరో కీలక నిందితురాలు బీజేపీ నేత రంగమ్మ నాయుడు. బాధితులను ట్రాప్ చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ఈ హనీ ట్రాప్ గ్యాంగ్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన వెంటనే పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడతారు. కానీ, ఈ కేసులో నిందితులు టీడీపీ-బీజేపీ కూటమికి చెందిన నేతలు కావడంతోనే పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకురావడం లేదని బాధితులు మరియు విపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నిందితుల పేర్లను మరియు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతలే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా లేక తమ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి.
