హైదరాబాద్‌లోని నాచారం పరిధిలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. మల్లాపూర్ సమీపంలోని ఒక వైన్స్ షాపులో కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో చేప పిల్ల కనిపించడంతో ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని వైన్స్ షాపులో కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్‌ను ఓపెన్ చేసిన తర్వాత గ్లాసులో పోయే సమయంలో అందులో చిన్న చేప పిల్ల ఉన్నట్లు గమనించాడు. దీనిని చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.
బీర్ బాటిల్‌లో చేప పిల్ల కనిపించడం చూసి వెంటనే అతను వైన్స్ షాప్ వద్దకు వెళ్లి విషయం తెలిపాడు. అనంతరం ఈ ఘటనపై వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ ఘటనపై మద్యం తయారీ సంస్థ మరియు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తయారీ సమయంలోనే బాటిల్‌లోకి చేప ఎలా వెళ్లిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇది తయారీ లోపమా లేదా నిల్వ సమయంలో జరిగిన ఘటననా అన్న విషయంపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
