మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో మానవ సంబంధాలను కలచివేసే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనివ్వలేదన్న కారణంతో ఓ కుమారుడు తన తండ్రినే హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న షకీర్ (51) అనే వ్యక్తి ఈ దారుణానికి బలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం, షకీర్ కొడుకు మొహమ్మద్ హుస్సేన్ గత కొంతకాలంగా తనకు బైక్ కొనివ్వాలని, భూమిని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తన డిమాండ్లు నెరవేర్చాలంటూ తండ్రిపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. నెల రోజుల క్రితం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో తండ్రిపై దాడి చేయడంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.
అయితే ఈ రాజీ ఎక్కువ కాలం నిలువలేదు. తాజాగా రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని మొహమ్మద్ హుస్సేన్ బయటికి లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. దాడిలో షకీర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
