హైదరాబాద్ పోచారంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చింది భార్య . చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టి హత్య చేసిందని మృతుడి తల్లి ఆరోపించింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
భార్య సోనితో కలిసి జీవనోపాధి కోసం 16 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఘట్‌కేసర్ మండలం, అన్నోజిగూడలోని లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తూ కూలీలుగా పనిచేస్తున్నారు రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, కర్కల్ పహాడ్ గ్రామం, నార్లకుంట తండాకు చెందిన జాతవత్ నరేందర్ (40).
వారికి కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా.. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ చదువుకుంటోంది కుమార్తె. అయితే నరేందర్, సోనీలకు మద్యం సేవించే అలవాటు ఉండడంతో.. మద్యం మత్తులో తరచుగా గొడవ పడుతున్నారు భార్యాభర్తలు.
నిన్న ఉదయం 10 గంటలకు నరేందర్ మరణించాడని, అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని మృతుడి తల్లికి సమాచారం అందించారు పోలీసులు.తన కుమారుడిది సహజ మరణం కాదని, కోడలు సోని పథకం ప్రకారం ఆమె సోదరులు నానావత్ రమేశ్, నానావత్ భాస్కర్ల సహకారంతో నరేందర్ మెడకు చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టి హత్య చేసిందని, దీంతో తలకు తీవ్ర గాయాలై మరణించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు నరేందర్ తల్లి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
