పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం మరియు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇంధనం మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇదే బాటలో నడవాలని త్వరలోనే అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి రెండు రోజులు ఇంటి నుండే పనిచేసే విధానాన్ని అమలు చేస్తారు. ప్రైవేట్ కంపెనీలు కూడా దీన్ని అనుసరించాలని కోరుతూ మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.అధికారులకు ప్రస్తుతం కేటాయిస్తున్న 200 లీటర్ల పెట్రోల్ కోటాలో 20 శాతం మేర కోత విధించారు.
మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రతి సోమవారం ప్రజా రవాణా వ్యవస్థను (మెట్రో) వాడాలని, ఆ రోజును ‘మెట్రో మండే’గా పాటించాలని నిర్ణయించారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్యాలయ వేళలను మార్చారు.
ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు: ఉదయం 10:30 నుండి రాత్రి 7:00 వరకు.
MCD కార్యాలయాలు: ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 వరకు. వారానికి ఒకరోజు సొంత వాహనాలను వాడొద్దని ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాబోయే ఆరు నెలల వరకు ప్రభుత్వం ఎటువంటి కొత్త వాహనాలను కొనుగోలు చేయదు. ఉద్యోగులకు ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సరుకు రవాణా కోసం ట్రక్కులకు బదులుగా వీలైనంత వరకు రైళ్లను ఉపయోగించాలని వ్యాపారవేత్తలకు ప్రభుత్వం సూచించింది.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం మరియు నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు మరియు ఉద్యోగులు సహకరించాలని ఆమె కోరారు.
