ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ సహా కవిత, 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టులో రిలీఫ్ దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కవిత.. నేను ఏ తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ముందే చెప్పాను… చెప్పినట్టే వచ్చాను” అని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తన నిర్దోషిత్వాన్ని మరోసారి నిరూపించిందని ఆమె అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు ఉన్న సంపూర్ణ నమ్మకాన్ని ఈ తీర్పు నిజం చేసిందని పేర్కొన్నారు.
తనపై రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేశారని, తనపై నోరు జారినవారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని కవిత వ్యాఖ్యానించారు. నిజం చివరకు గెలుస్తుందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అదే జరిగిందని అన్నారు. తాను ఎలాంటి అవినీతి చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పునరుద్ఘాటించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ప్రజా సమస్యల కోసం తన పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు. ఈ పరిణామం తనకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని, ప్రజల విశ్వాసమే తన బలం అని చెప్పారు. సత్యం, న్యాయం చివరకు విజయం సాధిస్తాయనే నమ్మకంతో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు.
