టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌కు సంబంధించిన భూకబ్జా వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును పరిశీలించిన లోకాయుక్త కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అప్పటి అధికారుల పాత్రపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
నివేదికల ప్రకారం, 2016లో మాజీ సైనికులకు కేటాయించిన భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ 8/1లో 2.92 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూమి బి.కె.పల్లి గ్రామంలో చెరువు పోరంబోకు భూమిగా నమోదై ఉండగా, అక్రమంగా పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు.
ఫేక్ పట్టాతో ఈ భూమిని దొమ్మలపాటి రమేష్, ఆయన భార్య సరళ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు స్పష్టమైంది. ఈ అక్రమ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓలు మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారని కలెక్టర్ నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, సెలవు రోజైన ఆదివారం నాడు కూడా రికార్డుల మార్పు చేసినట్లు గుర్తించారు.
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం, ఐదుగురు ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సూచించింది.
అయితే, ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, అదే అంశంపై లోకాయుక్తలో కొనసాగుతున్న కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఈ భూకబ్జా కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
