పశ్చిమ బెంగాల్‌లో కొత్త బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ…98 ఏళ్ల బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్‌లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించగానే సభలో ఉన్నవారు హర్షధ్వానాలతో స్పందించారు.
దీంతో ఇప్పుడు అంతా ఎవరి మఖన్‌లాల్ సర్కార్ అని ఆరా తీస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి పునాదులు వేసిన తొలి తరం నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం అనంతర కాలం నుంచే జాతీయవాద ఉద్యమాలతో అనుబంధం కలిగిన ఆయన, భారతీయ జనసంఘ్ రోజుల నుంచే రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా బీజేపీ వర్గాలు ఆయనను గౌరవిస్తాయి.
1952లో జమ్మూకాశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్న ఉద్యమంలో జనసంఘ్ స్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వెంట మఖన్‌లాల్ సర్కార్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆ ఉద్యమం భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టంగా నిలవగా, ఆ ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా మఖన్‌లాల్ సర్కార్ ఇప్పటికీ గుర్తింపు పొందుతున్నారు.
బీజేపీ ప్రారంభ దశలో పార్టీ బలహీనంగా ఉన్న కాలంలో గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో మఖన్‌లాల్ సర్కార్ కీలక పాత్ర పోషించారు. పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన ఆయనను గౌరవిస్తూ ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించడం రాజకీయంగా కూడా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మోదీ, మఖన్‌లాల్ సర్కార్‌ను ఆలింగనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. “పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలకు ఇది గౌరవం అంటూ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
