తెలంగాణ రాజకీయాల్లో కొత్త కదలికలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)తో కీలక భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పీకే పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి కవితతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాజకీయ వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై లోతైన చర్చ జరిగినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ పార్టీలో విభేదాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేయగా, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని భావించిన కవిత, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రజలే కేంద్రంగా రాజకీయ పార్టీ ఎలా ఉండాలి? ఆ పార్టీ ప్రజలకు తమదేనన్న భావన ఎలా కలిగించాలి? ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలి? వంటి అంశాలపై పీకేతో ఆమె విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.
ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునే విధానాలపై అధ్యయనం చేసేందుకు సుమారు 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు భిన్న రంగాలకు సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు పీకే రంగంలోకి దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రశాంత్ కిశోర్ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో వ్యూహకర్తగా విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత పెద్ద స్థాయి విజయాలు సాధించలేకపోయారు. బిహార్‌లో సొంతంగా ‘జన సురాజ్’ పార్టీ పెట్టి ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా, రాజకీయ వ్యూహకర్తగా ఆయన సేవలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి, తమిళనాడులో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీకి ఐప్యాక్ సేవలందిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కవిత పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించేందుకు పీకే సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, గతంలో బిహార్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. “మీ సొంత గడ్డపైనే మిమ్మల్ని ఓడిస్తా” అంటూ రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కవిత–పీకే కలయిక తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
