తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు.
ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తన, కొనసాగుతున్న పార్టీ వ్యతిరేక చర్యలు బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తున్నాయి… పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు అని తెలిపింది.
వాస్తవానికి కవిత సస్పెన్షన్‌ను పార్టీ నేతలు ముందే ఉహించారు. ఎందుకంటే కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ అవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, బీసీలకు రిజర్వేషన్ల పోరాటంపై విఫలం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆరోపించడం వరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావలనే అంతర్గతంగా రాసిన లేఖను లీక్ చేశారని, కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా పార్టీ నేతలు స్పందించడం లేదని మండిపడ్డారు.
తరువాత, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు గుప్త ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చేసి, ఢిల్లీలోని మద్యం కేసులో జైలులో ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని అన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించకుండానే ట్వీట్లు పెట్టడం సరిపోదు అని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం (టిబిజికెఎస్) గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె తొలగింపుతో విభేదాలు మరింత పెరిగాయి. ఇది కూడా లేఖ లీక్ వ్యవహారానికి ప్రతీకారమేనని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించిన సమయంలో కవిత, తన బంధువులైన హరీష్‌రావు, శాంతోష్ కుమార్‌లను బహిరంగంగా నిందించారు. కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకత్వం మొత్తం హరీష్‌రావుకు బహిరంగ మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు కేసీఆర్.
