త్వరలో మహిళల ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. మహిళల వన్డే ప్రపంచకప్ (సెప్టెంబర్ 30 – నవంబర్ 2)కి ICC భారీ ప్రైజ్‌మనీని ప్రకటించింది.
మొత్తం బహుమతి రూ.13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు (₹115 కోట్లు). ఇది 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన చివరి ఎడిషన్‌లో ఇచ్చిన 3.5 మిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అంతేగాదు ఇది 2023లో భారత్‌లో జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ బహుమతి (10 మిలియన్ డాలర్లు) కంటే కూడా ఎక్కువ.
ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో చారిత్రాత్మక మలుపు అని ICC ఛైర్మన్ జై షా అన్నారు. ప్రైజ్ మనీని నాలుగు రెట్లు పెంచడం, మహిళల క్రికెట్ దీర్ఘకాల వృద్ధికి మా కట్టుబాటును ప్రతిబింబిస్తుంది… మహిళా క్రికెటర్లు పురుషుల మాదిరిగానే సమాన గౌరవం, అవకాశాలు పొందుతారని ఈ నిర్ణయం స్పష్టంగా తెలియజేస్తుంది అని తెలిపారు.
ప్రైజ్‌మనీ వివరాలు..
విజేత జట్టు: 4.48 మిలియన్ డాలర్లు (2022లో ఆస్ట్రేలియాకు 1.32 మిలియన్ మాత్రమే లభించింది; 2023లో పురుషుల జట్టు 4 మిలియన్ పొందింది).
రన్నరప్ జట్టు: 2.24 మిలియన్ డాలర్లు (2022లో ఇంగ్లాండ్‌కి 600,000 మాత్రమే).
సెమీఫైనల్ ఓటమి జట్లు: ఒక్కొక్కటికి 1.12 మిలియన్ డాలర్లు (గతంలో 300,000 మాత్రమే).
గ్రూప్ స్టేజ్‌లో ప్రతి విజయానికి: 34,314 డాలర్లు.
5వ, 6వ స్థానాలు: ఒక్కొక్కటీ 700,000 డాలర్లు.
7వ, 8వ స్థానాలు: ఒక్కొక్కటీ 280,000 డాలర్లు.
ప్రతి జట్టుకి హామీగా: కనీసం 250,000 డాలర్లు.
ఈ ఎనిమిది జట్ల ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ భారత్, శ్రీలంకలలో సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది.
