ఏపీలోని తిరుపతి జిల్లా గంగిరెడ్డిపల్లి గ్రామ సచివాలయం వద్ద యూరియా పంపిణీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వారికే యూరియా ఇస్తున్నారని బీజేపీ నేత శంకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గ్రామ సచివాలయం వద్ద జరిగిన యూరియా పంపిణీలో నిబంధనలు పాటించకుండా టీడీపీ నాయకుల జోక్యం పెరిగిందని శంకర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు సూచించిన రైతులకే యూరియా అందజేస్తూ, సాధారణ రైతులను పక్కన పెడుతున్నారని విమర్శించారు. దీంతో నిజంగా అవసరం ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక చంద్రబాబు నాయుడుపై కూడా శంకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సహకారం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, పథకాల ఆధారంగానే టీడీపీ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీజేపీ “బిక్ష”తోనే పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ, అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చూపడం లేదని ఆరోపించారు.
యూరియా వంటి కీలక ఎరువుల పంపిణీలో రాజకీయాలు చేయడం రైతాంగానికి తీరని నష్టం చేస్తుందని శంకర్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ విధానాన్ని మార్చి, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి రైతుకు సమానంగా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ తరఫున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
