మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది కేంద్ర ప్రభుత్వంపై కూడా పోరాట దృక్పథమే అని స్పష్టం అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాతో ఈ విషయంలో ఆ పార్టీ స్టాండు అర్థం అయ్యింది.
మరి ఇప్పుడు అందుకు పర్యవసనాలు మొదలయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటురాష్ట్ర ప్రభుత్వం జగన్ ను కట్టడి చేయడానికి కొత్త వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. న్యాయస్థానం ద్వారా దాన్ని అమలు పెడుతున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయిప్పుడు!
జగన్ పై నమోదైన ఆస్తుల కేసును ఇక వారాంతంలో విచారించాలని నిర్ణయించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ప్రతి శుక్రవారం కేవలం ఈ ఒక్క కేసునే విచారించాలని నిర్ణయించారట. విచారణను వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదంతా జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టడం.. బీజేపీ పై ధ్వజమెత్తడం బాబు, మోడీ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయాన్ని వినిపించడం వల్లనే అని విశ్లేషకులు అంటున్నారు.
జగన్ సైలెంట్ గా ఉంటే పర్వాలేదు.. మాపై కి వస్తే.. ఈ విధంగా ఏదో విధంగా అతడిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం అనే ఇండికేషన్లు ఇస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ పరిస్థితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎలా ఎదుర్కొంటాడో!
