వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేవరకు వెనుదిరిగేది లేదని తెల్చిచెబుతున్నారు. సింఘు సరిహద్దు (హరియాణా-దిల్లా సరిహద్దు)లో రాత్రిళ్లు సైతం రోడ్లపైనే ఉంటూ ధర్నాను కొనసాగిస్తున్నారు రైతులు.
కేంద్రంతో ఐదుదఫాలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకపోవటం వల్ల డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ క్రమంలో వారికి దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. రేపటి భారత్ బంద్‌లో తామూ పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతుల వద్దకు వెళ్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సింఘూ సరిహద్దులో రైతుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
