మెక్సికోలోని ప్రపంచ ప్రసిద్ధ టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులతో కిక్కిరిసి ఉన్న సమయంలో ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒక పర్యాటకుడు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ దారుణ దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉదయం 11:30 గంటల సమయంలో పర్యాటకులు ‘పిరమిడ్ ఆఫ్ ది మూన్’ (Pyramid of the Moon) ఎక్కుతుండగా, జూలియో సెసార్ జాస్సో రామిరెజ్ (27) అనే వ్యక్తి అకస్మాత్తుగా పిరమిడ్ పైకి ఎక్కి తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు.కాల్పుల శబ్దం వినగానే పర్యాటకులు ప్రాణభయంతో పిరమిడ్ మెట్లపై నుండి కిందకు పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో కూడా పలువురు గాయపడ్డారు.
కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.నిందితుడు పురాతన టియోటిహుకాన్ నాగరికతలోని ‘నరబలి’ ఆచారాల పట్ల తీవ్రమైన వ్యామోహాన్ని పెంచుకున్నాడని, ఆ ఆచారాలను తిరిగి అమలు చేయాలనే పిచ్చితోనే ఈ దాడికి పాల్పడ్డాడని అధికారులు గుర్తించారు. ఈ దాడిలో కెనడాకు చెందిన ఒక పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో అమెరికా, కొలంబియా, బ్రెజిల్, రష్యా దేశాల పర్యాటకులు ఉన్నారు.
