కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో ఉదయం భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అభివృద్ధి చేసిన మానవరహిత విమానం(యూఏవీ) కూలిపోయింది.కర్ణాటకలోని చిత్రదుర్గలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా, సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా పొలాల్లో కుప్పకూలిపోయింది. విమానం తునా తునకలయ్యింది.
ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న డీఆర్ డీవో శాస్త్రవేత్తలు, అధికారులు విమాన శకలాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.కూలిన డ్రోన్ డీఆర్‌డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో విఫలమవడంతో డ్రోన్ వ్యవసాయ క్షేత్రంలో కూలిందని, డ్రోన్ కూలడంతో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడగా, వారిని అక్కడి నుంచి పంపి తాము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
