తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ నష్టాల్లో నడవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 95 డిపోలుంటే అందులో 90 డిపోలు నష్టాల్లో ఉండడమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారుల ఆదాయ మార్గాలపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆర్టీసి ఇన్ని నష్టాలతో ఉంటే ఇక దీన్ని కొనసాగించడమెందుకు అని ఆయన అన్నారు.
అధికారులు, కార్మికులు అందరూ సహకరిస్తేనే సంస్ధను నడుపుదామని, లేకపోతే మూసేద్దామని సిఎం హెచ్చరించారు. అయినా ఆర్టీసి లాభాల్లోకి తీసుకువచ్చే వీలున్నా దాని గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకోరని ఆయన అధికారులను నిలదీసారు. సంస్ధ నష్టాల్లో ఉన్నా కార్మికులు కోరిన దానికంటే ఎక్కువగా 44 శాతం ఫిట్ మెంట్ ప్రకటించామని కెసిఆర్ గుర్తు చేశారు.
ఒకవైపు ప్రయివేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ కూడా లాభాలు గడిస్తూంటే మనం మాత్రం నష్టాల్లో ఉన్నామని ఆయన అన్నారు. ఇక మీదట 10 నుంచి 15 మంది పట్టే బస్సులను నడపాలని, వీలైతే ప్రయాణీకులను వారి వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లేలా బస్సులు నడపాలని సిఎం సూచించారు. అన్ని డిపోలకు చెందిన అధికారులు, కార్మికులతో చర్చించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
