Thursday, May 16, 2024
- Advertisement -

పఠాన్ కోట్ లో ఉత్కంఠ

- Advertisement -

పఠాన్ కోట్ లో ఉగ్ర అలజడి రేపుతోంది. వైమానిక స్థావరంలో చొరబడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌జీ బలగాలు భారీగా మోహరించి ఉగ్రవాదుల కోసం అణువణువూ గాలిస్తున్నాయి. దాంతో పఠాన్ కోట్ లో ఉత్కంఠ, యుద్ధవాతావరణం నెలకొన్నాయి. 

శనివారం ఉదయం వైమానిక స్థావరంపై దాడికి దిగి బీభత్సం సృష్టించిన ఉగ్రవాదులు.. ఆదివారం కూడా దాడులకు తెగబడ్డారు. శనివారం నలుగురు ఉగ్రవాదులను ముట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఆదివారం కూడా ఆపరేషన్ ను కొనసాగించాయి. మరో ఇద్దరు వైమానిక స్థావరంలో నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన బలగాలు, ఉగ్రవాదుల్లో ఒకరిని హతమార్చాయి. దీంతో మొత్తం ఆరుగురు ముష్కరుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన మరో ఉగ్రవాది కోసం కూంబింగ్ కొనసాగుతోంది. 

ఉగ్రపోరులో శనివారం ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… ఆదివారం మరో ముగ్గురు మృతి చెందారు. వైమానిక స్థావరంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఐఈడీ బాంబుపేలి ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. పలువురికి గాయాలయ్యాయి. ఐఈడీ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పేలుడు జరిగినట్లు సమాచారం. 

ఇటు ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఇద్దరు జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరికతో ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో భద్రత కోసం కేంద్ర పారామిలటరీ బలగాలను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

పఠాన్‌కోట్‌ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మోడీ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -