Tuesday, May 14, 2024
- Advertisement -

తిరుపతి లో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ స్పీచ్

- Advertisement -

జన సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరవాత బీజేపీ – టీడీపీ లకి సపోర్ట్ గా నిలిచారు తప్ప స్పెషల్ గా తన సొంత పార్టీ కోసం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ కృషి చెయ్యలేదు. గత ఎన్నికల్లో అ రెండు పార్టీలు ఏపీ లో గెలవడం లో క్రూషియాల్ రోల్ పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ ని అభివృద్ధి పథం లో నడిపించే పనిలో భాగంగా జన సేన ప్రస్థానం మొదలు పెట్టారు.

తనకి ఇష్టమైన తిరపతి లో ఈ ప్రోగ్రాం ని షురూ చేసిన ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. పలువురు తనను టీడీపీ పక్షపాతినని ఆరోపిస్తున్నారని, అయితే తాను ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో తొత్తుని కాదని, అదే సమయంలో తాను ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు మాత్రం తొత్తునేనని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సినిమాలను ఏ రోజూ సీరియస్ గా తీసుకోలేదని ఆయన చెప్పారు. సినిమాలను పెద్దగా పట్టించుకోని తాను జీవితాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటానని అన్నారు. సినిమాలను అభిమానించే వారెవరూ వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. సినిమా నటులను సీరియస్ గా అభిమానించి క్షణికావేశాలతో జీవితాలు నాశనం చేసుకోకండని ఆయన పిలుపునిచ్చారు.  సినీ నటులమైన తమ మధ్య మంచి వాతావరణం ఉందని, తామంతా చాలా స్నేహంగా ఉంటామని ఆయన చెప్పారు. కోలారులో తన అభిమాని, జనసేన కార్యకర్త రాయల్ వినోద్ హత్య అతని తల్లికి కడుపుకోతను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు చాలా బాధ అనిపించిందని ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె గుండె ధైర్యం ప్రదర్శించి, కుమారుడి కళ్లను దానం చేసిన గొప్ప మహిళ అని ఆమెను అభినందించారు. అభిమానులు, కార్యకర్తలు తనను చూసేందుకు లేదా తనతో మాట్లేందుకు వస్తే తనకు ఆనందమని పవన్ చెప్పారు. అయితే అలా వచ్చేవారంతా గుర్తుంచుకోవాల్సింది ఒకటుందని ఆయన చెప్పారు. అంతా క్షేమంగా రండి, క్షేమంగా వెళ్లండి అని ఆయన పిలుపునిచ్చారు. న‌రేంద్ర‌ మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేముందు ఢిల్లీకి వెళ్లి ఆయ‌నతో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పాన‌ని మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఆయన వద్దకు వెళ్లలేదని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

తిరుప‌తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ ‘నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను. మిమ్మ‌ల్ని మోసం చేయ‌ను. బీజేపీ అదిష్ఠానం నుంచి ఓ నేత‌ వ‌చ్చి న‌న్న‌డిగారు. జాతీయ పార్టీల‌కే భ‌విష్య‌త్తు ఉంద‌ని బీజేపీలోకి వ‌చ్చేయ‌మ‌న్నారు. నేనేం స‌మాధానం చెప్పానో తెలుసా..?  తెలుసా..? నాకు బీజేపీపై గౌర‌వం ఉందని అన్నాను. తెలుగు రాష్ట్రాల‌ స‌మ‌స్య‌ల కోస‌మే జ‌న‌సేన అన్నాను. ప్రాంతీయ పార్టీ అవ్వొచ్చు కానీ జాతీ శ్రేయ‌స్సును కోరే పార్టీ. అంత‌ర్జాతీయ ప్ర‌భావం దేశంపై ఎలా ఉంటుందో కూడా దృష్టి పెట్టే పార్టీ అని చెప్పాను’ అని ప‌వ‌న్ అన్నారు. అలా బీజేపీలో కి వెళ్లాల‌నుకుంటే ఎప్పుడో వెళ్లిపోయేవాడినని, తాను బీజేపీ పార్టీని గౌర‌విస్తానని, కానీ అందులోకి మాత్రం వెళ్లను అన్నారు పవన్.

‘ఎవ‌రి జెండానో మోయ‌డానికి కాదు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మోయ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఒక‌వైపు మోదీ విదేశాలు తిరుగుతున్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. నాకు హోదాపై ఇటువంటి స‌మయంలో అడ‌గడం ఇష్టం లేదు. లేడీకి లేచిందే ప‌రుగ‌న్నట్లు వ్య‌వ‌హ‌రించ‌లేదు. ముందు చూద్దాం. వారేం చేస్తారో చూద్దాం అనుకున్నాను. కానీ రెండేళ్లు గ‌డిచిపోయాయి.. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడ‌బోయేది స్పెష‌ల్ స్టేట‌స్ కోస‌మే’ అని పవన్ అన్నారు. ‘మీకు సీమాంధ్రులంటే చుల‌క‌నా..? పౌరుషంలేని వారిమా..?  బీజేపీ, కాంగ్రెస్ సీమాంధ్రులతో ఎందుకిలా ఆడుకుంటున్నాయి… సీమాంధ్రుల ప్రేమ చూశారు.. వారి స‌హ‌నం చూశారు… ఇచ్చిన మాట వెన‌క్కి తప్పితే సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటే పోరాటం ఎలా ఉంటుందో ఇకపై చూస్తారు. యూపీఏ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని విడ‌గొట్టిన‌ప్పుడు ప‌ధ్ధ‌తి లేకుండా విడ‌గొట్టింది.. ఇంత మంది యువ‌కులున్నారు.

ఈ దేశానికి వెన్నుముక యువ‌త అంటారు. అలాంటి యువ‌త‌కి మ‌నం ఏం చెయ్యాలి… వారిని ఎలా ఉప‌యోగించుకోవాలి అనే ఆలోచ‌నే లేకుండా పాల‌న చేస్తున్నారు’ అని పవన్ వ్యాఖ్యానించారు.ఏపీకి ప్రత్యేకహోదా కోసం మూడు దశలుగా పోరాడుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ, ఈ పోరాటంలో భాగంగా తన తొలిఅడుగు బీజేపీ ఎక్కడైతే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందో అదే కాకినాడ నడిబొడ్డు నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోతే, స్టార్టప్ ఇండియా అని చెప్పి కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు ఇవ్వకపోతే మా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన అడిగారు. అంటే మీ పథకాలు మాటలకే పరిమితమా? అని ఆయన నిలదీశారు. చేతల్లో చూపించరా? అని అడిగారు.

ఇప్పటి వరకు మీ పథకాలతో నిరుద్యోగులు, విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడానికి ఏం చేశారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ రెండు జాతీయ పార్టీలు ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 16,500 కోట్లా? అని ఆయన అడిగారు. ఇలా మీరు నిధులు ఇస్తే… ఏపీ ఏనాటికి ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా తయారవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? అని ఆయన అన్నారు. విభజన సమయంలో పదో తరగతి చదివిన వాడు మరో పదేళ్లకు డిగ్రీ చేతబట్టి బయటికెళ్తే నిరుద్యోగిగానే మిగలాలా? అని ఆయన అడిగారు. మోదీతో వ్యక్తిగత పరిచయం ఉంది కదా… ఆయనను వ్యక్తిగతంగా కలిసి అడిగితే బాగుంటుంది కదా? అని పలువురు తనను ప్రశ్నిస్తుంటారని, అయితే తాను వ్యక్తిగతంగా ఆయనను అడిగితే… తనకు మాత్రమే ఏదో చేస్తానని చెబుతారని, అలా కాకుండా నేరుగా నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు.

మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌త్యేక హోదాకు అడ్డుప‌డుతున్నార‌ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుగారు అంటున్నారని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. మ‌రి ఆనాడు ఆరుకోట్ల మంది ప్ర‌జ‌లు విభ‌జ‌న‌కు అడ్డుపడలేదా? అని ఆయన ప్ర‌శ్నించారు. తిరుప‌తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ.. తుమ్మితే ఊడిపోయే పదవి కోసం ఏపీ నేత‌లు ఎందుకు ఆరాట‌ప‌డుతున్నారని అన్నారు. తనకు మోదీ అంటే గౌర‌వముందని, కానీ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టేంత అభిమానం లేదని పవన్ అన్నారు. ‘ఇక మీద‌ట సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లో ఉంటా.. డ‌బ్బులు సంపాదించాలి క‌దా!.. మీరు స‌ర్దార్ సినిమాను స‌రిగ్గా చూడ‌లేడు. నాకు డ‌బ్బులు రాలేదు.. సినిమాలు కూడా కొన‌సాగిస్తా. నా పోరాటం ప‌ద‌వి కోసం, రాజ‌కీయ లబ్ధి కోసం కాదు. సామాజిక మార్పు జ‌రిగితే చాలు. నా పోరాటానికి అధికార పార్టీ… ప్ర‌తిప‌క్ష పార్టీ అడ్డొస్తే వారితో విభేదిస్తా. సెప్టెంరులో 9న కాకినాడ‌లో మొద‌టి స‌భ పెడ‌తాను… హోదా సాధించే వ‌ర‌కు పోరాటాన్ని ఆప‌బోను. ఒకేసారి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయ‌బోను’ అని పవన్ అన్నారు. ‘ద‌శ‌లవారీగా వెళ‌తా.. హోదా సాధించే సందేశాన్ని ప్ర‌తి జిల్లాలోకి తీసుకెళ‌తా.

ఢిల్లీలో హిందీలో మాట్లాడ‌తారు.. మ‌న‌వాళ్ల‌కి హిందీరాదు.. మ‌న ఎంపీలు హిందీ క్లాసెస్‌కు వెళ్లాలి. హిందీ నేర్చుకొని ఢిల్లీలో అడ‌గాలి. కేంద్రానికి చెప్ప‌ద‌లుచుకున్నది సూటిగా చెప్పాలి. సీమాంధ్ర ఎంపీలు ధ‌న‌వంతులు.. వారిని చూసి స్పెష‌ల్ స్టేష‌న్ ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌కండి. ఆఖ‌రి మాట‌గా ఒకటే చెబుతున్నా పోరాడ‌దాం.. సాధించేవ‌ర‌కు పోరాడ‌దాం.. గెలిచేవ‌ర‌కు హోదా వ‌చ్చేవ‌ర‌కు పోరాడ‌దాం… క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని క‌లిసినప్పుడు న‌న్ను మీడియా మిత్రులు అడిగారు.

అప్పుడన్నాను…  హోదా సాధ‌న నా ఒక్కడివ‌ల్ల ఏమ‌వుద్ది అని. మీ అంద‌రూ క‌లిస్తే పోరాడ‌తా.. మీరు నా బ‌లం.. మ‌న జాతి ఆడ‌ప‌డుచులు నా బ‌లం’ అని పవన్ వ్యాఖ్యానించారు.‘మీ బ‌లం చూసి నేను పోరాటానికి దిగుతా.. 70 కిలోల ఒక్క‌మ‌నిషిని ఏం చేస్తా? ఢిల్లీలో ఉన్న‌వారికి ఒక‌టే చెప్ప‌ద‌లచుకున్నా… మీరు మా కోపాన్ని, బాధ‌ని, చూడ‌లేక‌పోతున్నారు.. నసేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉంది, పోరాడ‌తాం, మా హ‌క్కును సాధించుకుంటాం .. మేము పోరాడ‌తాం.. గెలిచేవ‌ర‌కు పోరాడ‌తాం.. ఇదే కేంద్రం ముందు ఉంచే అంశం. జైహింద్’ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

Related

  1. తిరుప‌తిలో స‌భ పవన్ ఏం చెప్పరంటే?
  2. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు
  3. భార్యని చంపేసిన పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్
  4. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -