- Advertisement -

జ‌యరామ్ ఇంటికి ఎందుకెళ్లానో చెప్పిన శిఖా

- Advertisement -

రోజుకో ట్విస్ట్‌తో డైలీ సీరియ‌ల్‌లా సాగుతున్న కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో మ‌రో సంచ‌ల‌నం. ఈ కేసులో అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న శిఖా చౌద‌రి ఎట్ట‌కేల‌కు నోరు విప్పింది. తన భర్త హత్య వెనుక శిఖాచౌదరి ప్రమేయం ఉన్నట్లు జ‌య‌రామ్‌ భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. తమ ఆస్తులు లాక్కునేందుకు ప్రియుడితో కలిసి జయరాంను హత్య చేయించిందని ఆరోపించారు. చెక్‌ పవర్‌ కూడా ఆమెకే ఉందని.. శిఖా చౌదరికి ఏపీ పోలీసులు క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.

కొన్ని రోజులు మీడియాల్లో వ‌స్తున్న క‌థ‌నాలు,డైరెక్ట్‌గా ప‌ద్మ‌శ్రీ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఇక డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వ‌చ్చారు శిఖా చౌద‌రి. జయరామ్‌ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని.. కేసు విచారణలో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. జయరామ్ మ‌ర‌ణించిన వెంట‌నే త‌న ప్రాజెక్టు రిపోర్టును ఇంటికి తీసుకువెళ్లారని, దాన్ని తెచ్చుకునేందుకే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. తన అత్త పద్మశ్రీతో తనకు సత్సంబంధాలు లేవని, ఆమె వస్తే తాను ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదని.. అందుకే అమెరికా నుంచి ఆమె వచ్చేలోపే ఇంటికి వెళ్లి ప్రాజెక్టు రిపోర్టు తెచ్చుకున్నట్లు చెప్పారు. పద్మశ్రీ ఆరోపిస్తున్నట్లుగా జయరాం ఇంట్లోంచి తానెలాంటి విలువైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోలేదన్నారు.

ఇక హ‌త్య జ‌రిగిన రోజు జయరామ్ తనతో మాట్లాడారని చెప్పారు శిఖా. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తన ఇంటికి వచ్చారని, రాత్రి 8 గంటల వరకు తన కొత్త ప్రాజెక్టు పని గురించి చర్చించినట్లు చెప్పారు. తిరిగివెళ్తూ తన ప్రాజెక్టు రిపోర్టును జయరాం వెంట తీసుకెళ్లారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం తనకు ఫోన్‌ చేసి డబ్బులు అవసరం ఉన్నాయని రూ. కోటి సర్దాల్సిందిగా అడిగారు. ఎందుకని అడిగేంత అవకాశం ఇవ్వకుండానే వెంటనే ఫోన్‌ పెట్టేశారు. 31వ తేదీ ఉదయం కూడా ఫోన్‌ చేసి డబ్బు అడిగారని.. ఎందుకని అడిగితే ఏడాదిక్రితం తాను ఓ వ్యక్తి వద్ద రూ. 4 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు చెప్పాడ‌న్నారు. ఆ అప్పును తీర్చాల్సిందిగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పాడు. జయరామ్‌తో తాను మాట్లాడటం అదే చివరిసారి అన్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ల అమ్మ ఫోన్‌చేసి అంకుల్‌ చనిపోయారని చెబితేనే తనకు తెలిసిందన్నారు. జయరామ్‌కు సబంధించిన ఆస్తిపాస్తులేవీ తన పేరుమీద లేవని శిఖాచౌదరి చెప్పారు.

ఇక రాకేష్ రెడ్డి గురించి స్పందించిన శిఖా.. 2017లో త‌న‌తో ప‌రిచ‌య‌మైంద‌ని.. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో 7 నెల‌లుగా దూరం పెట్టినట్లు చెప్పారు. రూ. 4 కోట్లు అప్పిచ్చే స్థోమత రాకేశ్‌కు లేదన్నారు. హత్య కేసులో అత్త పద్మశ్రీని ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక జయరామ్‌ బంధువుల ఫిర్యాదు మేరకు ఈ హత్యకేసును తెలంగాణ పోలీసులు మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు. తొంద‌ర‌లోనే శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిని హైదరాబాద్ తరలించి, విచారణ జరపనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -