భారత వాయుసేన అధికారి మరియు అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గురువారం తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి జరిగిన అక్షియం మిషన్-4లో పాల్గొన్న ఆయన ఈ అనుభవం భారత ప్రతిష్టాత్మక ‘గగనయాన్’ మిషన్‌కి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
ఇస్రో చీఫ్ డా. వి. నారాయణన్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో శుక్లా మాట్లాడుతూ…భూమి మీద శిక్షణ కంటే అంతరిక్ష అనుభవం పూర్తిగా భిన్నం… భారత్ అంతరిక్షం నుంచి ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తోంది. భారత్ ఆజ్ భీ అంతరిక్ష్ సే సారే జహాన్ సే అచ్ఛా దిఖ్తా హై… జై హింద్, జై భారత్ అని గర్వంగా పేర్కొన్నారు.
ఈ మిషన్ సాధ్యమైనందుకు భారత ప్రభుత్వం, ఇస్రో శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఫాల్కన్-9 రాకెట్‌పై ప్రయాణించాం… క్రూ డ్రాగన్ అనే మూడు వాహనాల్లో ఒకదానితోనే మానవులను అంతరిక్షంలోకి పంపగలుగుతాం…. ఈ మిషన్‌లో నా బాధ్యత ‘మిషన్ పైలట్’గా ఉండేది. కమాండర్‌తో కలిసి వాహన వ్యవస్థలతో పని చేయాలి. భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రయోగాలు, STEM డెమోన్స్ట్రేషన్లు నిర్వహించాం. అలాగే ఫోటోలు, వీడియోలు సేకరించాం అని వివరించారు.
త్వరలో భారత్ నుంచి స్వదేశీ రాకెట్‌తోనే ఒక భారతీయుడు అంతరిక్షానికి వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. భూమిపై నేర్చుకున్న దానికంటే అంతరిక్షంలో అనుభవం పూర్తిగా వేరేగా ఉంటుంది. 20 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత శరీరం ఆకర్షణ శక్తి (గ్రావిటీ)కి అలవాటు మరచిపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
