Thursday, May 23, 2024
- Advertisement -

ఆ మూడు జోడు గుర్రాల‌ను.. వీళ్లే లాగాలి

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. మిత్రుల‌నుకున్న‌వాళ్లు శ‌త్రువులుగా.. శ‌త్రువుల‌నుకున్న‌వాళ్లు మిత్రులుగా మారిపోయారిప్పుడు. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోనికి దిగ‌నున్న మూడు ప్ర‌ధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్‌, జ‌న‌సేనలు ఇప్ప‌టికే ఒక్కో జాతీయ పార్టీతో అంట‌కాగుతున్నాయి. ఒక్కో జాతీయ పార్టీతో మిత్ర‌ప‌క్షంగా సాగుతున్నాయి. జ‌న‌సే బ‌హిరంగంగానే త‌న మిత్రుడు వామ‌ప‌క్ష‌మేన‌ని ప్ర‌క‌టించి.. క‌లిసే స‌భ‌లు, స‌ద‌స్సులు, స‌మావేశాల్లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం త‌న చిర‌కాల మిత్ర పార్టీ బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుని.. ఇప్పుడు కాంగ్రెస్‌పై సానుకూల ధోర‌ణితో వెళ్తోంది. కాంగ్రెస్ జాతీయ‌స్థాయి నాయ‌క‌త్వం తెలుగుదేశం పార్టీపై బోలెడంత ప్రేమ‌ను కురిపిస్తోంది. ఇటునుంచి చంద్ర‌బాబు సైతం కాదంటూ స్పందించింది లేదు.

తెలుగుదేశం వ‌దిలేసిన‌.. బీజేపీతో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జ‌ట్టు క‌ట్టాడు. ఈ విష‌యం ఇప్ప‌టికే స్ప‌ష్టంగా పార్ల‌మెంట్ బ‌య‌ట‌, లోప‌లా, రాష్ట్రంలోనూ క‌నిపిస్తోంది. జ‌గ‌న్ సైతం బీజేపీని తన మిత్ర‌ప‌క్ష‌మ‌ని ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ.. ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తోనే రెండు పార్టీలు వెళుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ విష‌య‌మే దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. క‌న్నా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో మ‌రుస‌టి రోజు చేరిపోవ‌డానికి సిద్ధ‌మైపోగా.. ముందురోజు అమిత్‌షా నుంచి జ‌గ‌న్‌కు ఫోన్ రావ‌డం, వ‌ద్ద‌ని చెప్ప‌డంతో క‌న్నా ఆగిపోయారు. రెండు రోజుల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడైపోయాడు. దీనికితోడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని కార్యాల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం వంటివ‌న్నీ.. వైఎస్ ఆర్ కాంగ్రెస్‌, బీజేపీ మైత్రిని బ‌హిర్గ‌తం చేస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ మూడు ప్ర‌ధాన పార్టీలూ మిత్ర‌భావంతో సాగుతున్న జాతీయ పార్టీల‌కు రాష్ట్రంలో ప్ర‌భావం చూపించేంత పాపులారిటీ లేదు. దీంతో ఈ మూడు జాతీయ పార్టీల వ‌ల్ల తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్‌, జ‌న‌సేన‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం నామ‌మాత్ర‌మే. ఈ పార్టీల‌తో వాటికి లాభ‌మే త‌ప్ప‌.. వాటివ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేదు. అందుకే ఎంపిక చేసుకుని మ‌రీ ప్రాంతీయ పార్టీల స‌ర‌స‌న చేరేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి.

ప‌వ‌న్ ప్ర‌భావంతో నెట్టుకురావాల‌ని..
జ‌న‌సేనకి రాష్ట్రంలో పెద్ద‌గా ఓటు బ్యాంకు, బూత్‌స్థాయి కార్య‌క‌ర్త‌లు లేక‌పోయినా.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అశేష అభిమాన ఘ‌నం ఉంది. పార్టీకి వారంతా కార్య‌క‌ర్త‌ల కింద మారితే.. ఫ‌లితాలు ప్ర‌భావ‌వంతంగా ఉండ‌బోతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాపులారిటీ త‌మ‌కు సైతం క‌లిసొస్తుంద‌ని భావించిన సీపీఎం, సీపీఐ రెండు వామ‌ప‌క్ష పార్టీలు.. ఆయ‌న చెంత‌న చేరాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టే మీటింగ్‌లు, స‌మావేశాల‌కు వామ‌ప‌క్ష నాయ‌కులు త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. అలాగే వీళ్లు పెట్టే స‌భ‌ల‌కూ జ‌న‌సేన మ‌ద్ద‌తు తీసుకుంటున్నారు. వాస్త‌వంగా చూస్తే.. వామ‌ప‌క్ష పార్టీల‌కు రాష్ట్రంలో ఆద‌ర‌ణ పూర్తిగా త‌గ్గిపోయింది. బ‌రిలో నిల‌బ‌డినా క‌నీసం డిపాజిట్లు ద‌క్కే ప‌రిస్థితి కూడా లేదు. కేవ‌లం కొన్ని ప్రాంతాల్లోనే అక్క‌డి ఒక‌రిద్ద‌రు నాయ‌కుల కార‌ణంగా కాస్త ప్ర‌భావం చూపుతున్నాయంతే. అక్క‌డ కూడా పోరాటాల‌కే త‌ప్ప‌.. ఎన్నిక‌ల్లో పోటీకి ప‌నికిరానివే. ప‌వ‌న్ క‌ళ్యాణే పాపులారిటీనే వీళ్ల‌కు ఉప‌యోగ‌ప‌డాలి త‌ప్ప‌.. వీళ్ల వ‌ల్ల ప‌వ‌న్ పార్టీకి ప్ర‌యోజ‌నం శూన్య‌మే.

చంద్ర‌బాబును ప‌ట్టుకుని ఈదాల‌ని..
తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మిత్ర‌ప‌క్ష‌మ‌నేదే లేకుండా అయిపోయింది. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న కార‌ణంగా.. కాంగ్రెస్ మిత్ర హ‌స్తం చాస్తున్న‌ప్ప‌టికీ దాని వ‌ల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి లాభం లేదు. ఒక‌ప్పుడంటే కాంగ్రెస్ ఆంధ్ర‌లో బ‌లంగా ఉండేది. కానీ.. అడ్డంగా రాష్ట్ర విభ‌జ‌న చేసిన త‌ర్వాత‌.. పార్టీ అడ్ర‌స్ లేకుండా పోయింది. కాంగ్రెస్‌లో లీడ‌ర్లు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క‌చోట కూడా గెల‌వ‌లేదు. పోటీచేసిన వారంతా డిపాజిట్లు ద‌క్క‌కుండా పోయారు. ఒక‌వేళ వార్త‌లొస్తున్న‌ట్టు తెలుగుదేశం, కాంగ్రెస్ క‌లిసి బ‌రిలోనికి దిగితే.. అది కాంగ్రెస్‌కే లాభం తప్ప‌.. తెలుగుదేశానికి కాదు. కాంగ్రెస్‌కు ఉన్న విభ‌జ‌న అప‌వాదును చంద్ర‌బాబుతో చేరిపోగొట్టుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తోనే పొత్తుకు అర్రులు చాస్తోంది.

అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా జ‌గ‌న్‌..
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితీ ఇంచుమించు తెలుగుదేశం మాదిరిగానే ఉంది. చంద్ర‌బాబు వ‌దిలించుకున్న బీజేపీని అంటించుకున్న‌ట్టుంది జ‌గ‌న్ ప‌రిస్థితి. బీజేపీకి అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడూ పెద్ద‌గా రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదు. సింగిల్‌గా ఇంత‌వ‌ర‌కూ పోటీ చేసింది లేదు. ద‌శాబ్దానికి పైగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఓ నాలుగైదు సీట్ల‌ను తెచ్చుకుంటోంది. ఈసారి జ‌గ‌న్‌ను.. చంద్ర‌బాబు స్థానంలోనికి తెచ్చుకుని త‌మ‌కు ఎప్పుడూ వ‌చ్చే ఆ నాలుగు సీట్ల‌ను ఈసారీ కాపాడుకోవాల‌నేది బీజేపీ యోచ‌న‌. కానీ.. దీనివ‌ల్ల జ‌గ‌న్‌కు ప‌డే దెబ్బ మామూలుగా ఉండ‌దు. జ‌గ‌న్ బీజేపీతో అంట‌కాగితే.. రాష్ట్రంలోని ముస్లిం సామాజిక‌వ‌ర్గం ఆయ‌న‌కు దూర‌మైపోతుంది. రాష్ట్రంలోనూ ప్ర‌స్తుతం బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశార‌నో ధోర‌ణిలో యువ‌త సైతం ఉంది. దీంతో జ‌గ‌న్ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింది. పొత్తంటే.. ఇక్క‌డ దెబ్బ‌ప‌డుతుంది. లేదంటే.. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా దెబ్బ‌ప‌డుతుందేమోన‌ని భ‌యం వెంటాడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -