టీడీపీ నేతల హామీలు గాలిమూటలేనని తేలిపోయింది. నా తండ్రికి ఆపరేషన్ చేయించండి, మీ పార్టీ కోసం మా కుటుంబం అహర్నిశలు కష్టపడింది. మేం మొదట్నీ టీడీపీనే నమ్ముకున్నాం. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. పక్షవాతంతో బాధ పడుతున్నారు. ఆదుకోండి. వైద్యం చేయించండి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. టీడీపీ జెండాలు మోశాం. అజెండాను జనంలోకి తీసుకెళ్లాం. ఇప్పుడు మాకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన టీడీపీ నేతలే ఆదుకోకపోతే ఎలా ? మాకు దిక్కెవరు ? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమ కుటుంబానికి తండ్రి వైద్యఖర్చులు తలకు మించిన భారమయ్యాయని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా టీడీపీ నేతలు పట్టించుకోలేదని ఆయన కన్నీరుమున్నీరవుతూ పురుగుల మందు తాగి ఉసురు తీసుకున్నాడు. తూర్పు దళితవాడకు చెందిన టీడీపీ నాయకుడు యడ్ల దాసు రెండేళ్ల క్రితం నుంచి పక్షవాతంతో బాధ పడుతున్నాడు. అతని భార్య ఎస్తేరు కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. పెద్ద కొడుకు మేరీబాబు ఎంటెక్ పూర్తి చేసి ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. రెండో కొడుకు విజయ్ ఇంటర్ పూర్తి చేసి టీడీపీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ భవన నిర్మాణ పనుల్లో కూలీగా పని చేస్తున్నాడు. ముగ్గురూ కష్టపడుతున్నా చాలీచాలని సంపాదనతో దాసు వైద్య ఖర్చులు వారికి తలకు మించిన భారమయ్యాయి.
ఈ నేపథ్యంలో దాసు కుటుంబం పలుమార్లు స్థానిక టీడీపీ నేతల దృష్టికి తమ ఇంటి పరిస్థితిని తీసుకెళ్లారు. ఆదుకోవాలని అర్ధించారు. తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని వేడుకున్నారు. తమకూ పార్టీ తరఫున ఏదైనా మంచి పని ఇప్పించాలని విజయ్, అతడి తల్లి ఎస్తేరు కోరారు. ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేశారే తప్ప, టీడీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో నమ్ముకున్న పార్టీయే కష్టకాలంలో ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు..? అంటూ విజయ్ చీరాలలోని రామాపురం బీచ్ లో పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఫేస్ బుక్ లైవ్ లో తమ బాధలు, పార్టీ పెద్దలు పట్టించుకోని వైనాన్ని వివరించాడు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తమ కుటుంబానికి పార్టీ ఏ సాయమూ చేయలేదని, ఉద్యోగాలు రావట్లేదని విజయ్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫేస్ బుక్ లైవ్ లో చెప్పుకున్నాడు. తన మరణంతో అయినా టీడీపీ నేతలు తన తండ్రికి మెరుగైన వైద్యం ఇప్పించాలని, మంచంలో ఉన్న అతడిని బతికించాలని వేడుకున్నాడు. కుటుంబానికి ఆర్ధికసాయం చేసి ఆదుకోవాలని కోరాడు. బుధవారం ఈ ఘటన జరగగా, స్థానికులు గుంటూరు ఆసుపత్రిలో అతడిని జాయిన్ చేశారు. గురువారం వరకూ మృత్యువుతో పోరాడిన విజయ్ చివరికి కన్నుమూశాడు.
ఈ దుర్ఘటనతో అయినా టీడీపీ నేతలు కళ్లు తెరుస్తారని ఆశిద్దాం. ఎందుకంటే… టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ అద్భుతం. అమోఘం. పార్టీ మెంబర్ షిప్ తీసుకున్నవారు కోటిమందికి పైనే అనే ఆ మధ్య టీడీపీ నేతలు ఘనంగా ప్రకటించుకున్నారు. తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో ఎవరైనా ప్రమదావశాత్తూ మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా ఇస్తున్నామనీ చెప్పుకున్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు, లోకేశ్ బాబు సహా ఆ పార్టీ నేతలంతా డబ్బా కొడుతుంటారు. పార్టీకి కేడరే బలమని, పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోమని ఎప్పటికప్పుడు పార్టీ నేతలు ఊదరగొట్టేస్తుంటారు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, త్వరలోనే ఏపీ అంతటా టీడీపీ తప్ప మరో పార్టీ సభ్యత్వాలు ఉండని లోకేశ్ బాబు ఆ మధ్య ఘనంగా సెలవిచ్చారు. కార్యకర్తలారా మీరు టీడీపీ బాగోగులు చూసుకోండి. నేను మీ కుటుంబ యోగక్షేమాలు, బాగోగులు చూసుకుంటాను. అని హామీ కూడా ఇచ్చేశారు. మరి వీరు చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు, క్షేత్రస్థాయిలో జరిగే వాటికి పొంతన లేదని విజయ్ ఆత్మహత్య ఘటనతో తేలిపోయింది. ఇకనైనా మీ పల్లకీ మోసే వారి యోగక్షేమాలు పట్టించుకోండి టీడీపీ నేతలు. లేదంటే నష్టం మీకే.
