Friday, May 10, 2024
- Advertisement -

టీడీపీ ఎటకారం ఎక్కువైంది కానీ సలహా జగన్ కు మంచిదే…!

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. సంక్రాంతి నాటికి పాదయాత్రను ముగించే యోచనలో జగన్ ఉన్నారు. అయితే పాదయాత్రలో కవర్ చేయలేని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఆయా నేతలకు వివరించి, వారికి దిశానిర్దేశం చేయాలన్నదే బస్సు యాత్ర అసలు లక్ష్యం.

అయితే జగన్ బస్సుయాత్ర ప్రారంభించకముందే టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. నేడు పాదయాత్ర, రేపు బస్సుయాత్ర, తర్వాత తీర్ధయాత్ర చేస్తారని ఎద్దేవా చేస్తున్నారు. తమ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియా దీనిపై విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని, జగన్ మాత్రం యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన నేత అసెంబ్లీకి రాకుండా పారిపోవడమే కాకుండా, వరుస యాత్రలతో టైం పాస్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. బస్సుయాత్ర చేసే బదులు ఢిల్లీ యాత్ర చేసి, ప్రత్యేకహోదాపై మోడీని సర్కార్ ను నిలదీయవచ్చు కదా అని సూచిస్తున్నారు. కేసుల భయంతో మోడీని ప్రశ్నించకుండా యాత్రల పేరుతో జనాన్ని ముద్దులు పెట్టడమేంటని సెటైర్లు వేస్తున్నారు.

అయితే టీడీపీ నేతలు వెటకారంగా సూచించినా ఆ సలహా మాత్రం కచ్చితంగా జగన్ కు మేలు చేసేదే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పాదయాత్ర ద్వారా, జనం తనవెంటే ఉన్నారని నిరూపించుకున్న జగన్, టీడీపీ నేతలు సూచించినట్లు బస్సుయాత్రకు బదులు ఢిల్లీయాత్ర చేస్తే ఆయనకే మంచిది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఓ సారి ఢిల్లీ యాత్ర చేపట్టి ప్రత్యేకహోదాపై ఢిల్లీ సర్కారును నిలదీస్తే, అక్కడే ధర్నాలు, దీక్షలు చేస్తే ఎన్నికల్లో ప్రచారానికి ఆ అంశం మరోసారి కలిసొస్తుంది. ఎటూ ఏడాదిగా పాదయాత్ర పేరుతో జనంలోనే ఉన్న జగన్ బస్సుయాత్రకు బదులు ఢిల్లీయాత్ర చేయడమే మేలు కదా…మరి టీడీపీ వాళ్లు ఎద్దేవా చేస్తూ ఇచ్చిన ఈ సలహా మాత్రం జగన్ కు నిజంగా మంచి చేసే సలహానే. మరి జగన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -