Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్ డీఏ విజయం కోసం కేసీఆర్ ముందస్తు

- Advertisement -

2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ నుంచే రణభేరీ మోగింది. త్వరలో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్ అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ గా బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఆ క్వార్టర్ ఫైనల్స్ ను లైఫ్ అండ్ డెత్ గా భావించి రణరంగంలో దూకుతున్నాయి. ఏదైనా రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారికి ఎటువంటి లబ్ధి చేకూరకూడదని 2002లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో ముందుగా ఆయా రాష్ట్రాల్లోనే ఎన్నికలు నిర్వహించి, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం చూపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ ఆదేశాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్, మోడీ, అమిత్ షా మంతనాలు జరుపుకుని ముందస్తు రాగం తీశారు. ఇటీవల మోడీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగిపోతోంది. కర్నాటకలో బీజేపీ ఆడిన డ్రామాలను, చేసిన బేరసారాలను చూసి దేశమంతా కమలనాథులను ఛీ కొట్టారు. తమిళనాడులోనూ జయలలిత అనుమానాస్పద మృతి తర్వాత ఆమె పార్టీని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసి బీజేపీ నేతలు బంతాట ఆడుకోవడాన్నీ తూర్పారబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకి నిధులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించడంపైనా మండిపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బేజీపీ పాగా వేద్దామనే ఆలోచనతో చేస్తున్న ప్రతి పనీ బెడిసికొడుతోంది. పైగా స్పష్టమైన హామీలతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యకహోదాపైనే మా తొలి సంతకం అని రాహుల్, సోనియా సహా ఏఐసీసీ తీర్మానం చేసేసింది. కానీ బీజేపీ హోదాపై ఇంకా మోసపూరిత ధోరణితోనే వెళ్తోంది. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయి.

అటు తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతోంది. మరో 9 నెలల గడువు వరకూ ఉంటే ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశమే ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, రైతులు, అన్ని వర్గాల్లో అంసతృప్తి రాజుకుంటోంది. అది గమనించిన కేసీఆర్, ప్రజల మనసుల్ని గెల్చుకోవడం కంటే ప్రతిపక్షాలను గందరగోళంలోకి నెట్టేసి, వారు అన్నీ సర్దుకోవడానికి సరిపడా సమయం లేకుండా చేసి, ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో ముందస్తుకు వెళ్లారు. ఆయన ప్రభుత్వ పనితీరుపై నిజంగా ప్రజల్లో సానుకూల స్పందన ఉంటే ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేంటి ? జనం మనసుల్లో మనమే ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా మనదే విజయం. అని ధీమాగా ఉండేవారు కదా…అన్నది కాదనలేం.

అయితే ఇక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పై ప్రభుత్వ వ్యతిరేకత రాజుకున్నట్టే అక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పైనా ప్రభుత్వ వ్యతిరేకత రాజుకుంది. అది క్రమంగా బలపడి ఆ 3 రాష్ట్రాలతో పాటు మిజోరాం లోనూ బీజేపీ చతికిల పడి, కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తే, ఆ ఊపు ఆ తర్వాత 3 నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది. కచ్చితంగా బీజేపీకి చావుదెబ్బ తప్పదు. ఆ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం 4 రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలపైనే కాదు, దేశమంతటా పడుతుంది. ఆ ఊపులో తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. అదే జరిగితే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అక్కడ యూపీఏ అధికారం దక్కించుకుంటే కేసీఆర్ కు కష్టకాలం మొదలైనట్లే. ప్రత్యేకరాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానని చెప్పి, మోసం చేసాడనే ఆగ్రహంతో కాంగ్రెస్ అధిష్ఠానం రగిలిపోతోంది. యూపీఏ అధికారంలోకి వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందదు. అవన్నీ గ్రహించే కేసీఆర్ ఎలాగైనా కాంగ్రెస్ హవాను అడ్డుకోవాలని, 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ముందస్తుకు వెళ్లి, ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తే నైతికంగా సగం దెబ్బకొట్టినట్లేనని అంచనా వేశారు. తెలంగాణలో హస్తం పార్టీ ఓడిపోతే ఆ నిరాశ, నిస్పృహలతో 4 రాష్ట్రాల్లో వెనుకబడిపోతారని, తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ చతికిలపడిపోతారనేది కేసీఆర్ ఆలోచన. ఇదే అంశాలను మోడీ, అమిత్ షాతో చెప్పుకుని ముందస్తుకు సహకరించాలని కోరారు. తమ లక్ష్యమూ అదే కనుక వాళ్లు కూడా పూర్తి సహయసహకారాలు అందిస్తున్నారు. మొత్తానికి ఎన్డీఏ గెలుపు కోసం కేసీఆర్ పావులు కదిపితే, తెలంగాణలో కేసీఆర్ గెలుపు కోసం బీజేపీ సహకరిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -