Sunday, May 5, 2024
- Advertisement -

పొత్తుతో కాంగ్రెస్ చిత్తు !

- Advertisement -

గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడింది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా అధికారం దక్కించుకోలేకపోయినా పట్టు కోల్పోకుండా ఉనికి చాటుతూనే ఉంది. 2019లో అధికారం మాదేనని హస్తం పార్టీలు ఈ నాలుగేళ్లలో చెబుతూ వచ్చారు. వారి ఆశ నెరవేరే సమయం వచ్చింది. ముందస్తు ఎన్నికలతో ముందస్తుగానే అధికారం దక్కించుకునే అవకాశమిది. కానీ పొత్తులే వారి అవకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళన కూడా కాంగ్రెస్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఆ పార్టీతో మహాకూటమిగా జట్టుకడుతున్న పార్టీల బేరసారాలు, అత్యాశే కాంగ్రెస్ కొంప ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వనరులు, సీనియర్ నాయకులు పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉంది. కానీ సింగిల్ పార్టీగా ఓవర్ కాన్ఫిడెన్సుతో ఎన్నికలకు వెళ్లి చేదు అనుభవాలు ఎందుకు మూటగట్టుకోవడం అని ఆ పార్టీ భావిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికార టీఆర్ఎస్ లాభ పడుతుందని అంచనా వేసింది. అందుకే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల నాయకులతో సహకరించుకుని, ఓట్లు మార్పిడి చేయించుకుని మహాకూటమిగా అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది.

కాంగ్రెస్ ఆలోచనలు బాగానే ఉన్నాయి. జట్టు కట్టాలనుకుంటున్న పార్టీల్లో టీడీపీ ఫర్వాలేదు. కానీ మిగిలిన పార్టీల సంగతేంటి ? వారికి కేటాయించిన సీట్లలో ఆశలు వదులుకోవాల్సిందేనా ? మొత్తం 119 సీట్లలో తాము 90 సీట్లలో పోటీ చేసి, మిగిలిన 29 సీట్లను పొత్తులు పెట్టుకునే పార్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ భావించింది. కానీ వారికి మింగుడుపడని రీతిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ, నుంచి డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీలో ఇప్పుడు అంతే బలమైన లీడర్స్ లేకపోయినా కేడర్ మాత్రం అంతో ఇంతో ఉంది. అయితే ఆ పార్టీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ ను 30 సీట్లు అడుగుతోంది. కానీ అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు కష్టమే. చాలా స్థానాల్లో లీడర్లతో పాటు కేడర్ కూడా టీఆర్ఎస్ వైపు మరలిపోయింది. కానీ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో ఇంకా టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టు ఉంది. అయితే కాంగ్రెస్ 15 సీట్ల వరకూ టీడీపీకి కేటాయించే అవకాశముంది. అందులో ఐదారు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి.

ఇక నిన్నకాక మొన్న పురుడు పోసుకున్న కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి ఆశకు అంతు లేకుండా పోయింది. ఇంకా జనంలో రాజకీయ పార్టీగా గుర్తింపు కూడా తెచ్చుకోలేదు. క్షేత్రస్థాయిలో కేడర్ కూడా లేదు కానీ ఆ పార్టీ 15 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఒకవేళ 15 సీట్లు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కేటాయించినా అభ్యర్ధుల ఎంపిక కూడా వారికి కత్తి మీద సామే. అలాంటిది తమ బలం తెలుసుకోకుండా 15 సీట్లు కోరడం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బకొట్టడమే. వీరికి 4 లేదా 5 సీట్లు కాంగ్రెస్ కేటాయించే చాన్స్ ఉంది. ఆ సీట్లలో కూడా కోదండరామ్ గెలవవచ్చు, మిగతా సంగతి అభ్యర్ధుల ఖరారు తర్వాతే చెప్పగలం. అది కూడా కోదండరామ్ కరీంనగర్, సింగరేణి ప్రాంతాల్లో పోటీ చేస్తే గెలుస్తారనే అంచనాలున్నాయి. ఇక సీపీఐ 8 స్థానాలకు పట్టుబడుతున్నా వారికి అంత సీన్ లేదు. నల్గొండ ప్రాంతంలో సీపీఐ గెలవకపోయినా, గెలుపును కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. 3 సీట్లు సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. కానీ వాటిలో ఒకటి రెండు స్థానాల్లో విజయానికి చేరువగా వచ్చే చాన్సు ఉంది. ఆరు స్థానాలు మజ్లిస్ కు కేటాయించే అవకాశముంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 90 స్థానాల్లో పోటీ చేస్తే 50 స్థానాల్లో గెలవచ్చనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంకా కష్టపడితే, గట్టిగా పోరాడితే కాంగ్రెస్ గెల్చుకునే స్థానాలు పెరిగే చాన్సు ఉంది. కానీ ఈ పొత్తులతో వారికి లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా టీజేఎస్, సీపీఐతోనే నష్టం జరగవచ్చని అంచనా. ఇక టీడీపీలో ఎన్ని సీట్లు కేటాయించినా ఆ పార్టీలో ఆఖరికి టీటీడీపీ అధ్యక్షుడి సహా ఏ ఒక్కరినీ నమ్మలేని పరిస్థితి. కేసీఆర్ కోవర్టులుగా ఎవరెవరు ద్రోహం చేస్తారో తెలుసుకోలేని స్థితి. సో పొత్తులతో కాంగ్రెస్ నష్టపోతుందా ? ఏమో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -