ప్రతిసారి ఎన్నికల ముందు తనకు తాను సెల్ఫ్‌గోల్ వేసుకోవడంలో జగన్ తర్వాతే ఎవరైనా. అందుకే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేస్తే.. ఆ సమయంలో వారికి వ్యతిరేకంగా వెళ్లే వారందరికీ ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే జగన్ కాంగ్రెస్‌కు తొత్తనే రీతిలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాటనకుండా.. తప్పించుకునే ధోరణిలో ఉన్నట్టుగానే కనిపించడం.. తెలుగుదేశం వాదనకు బలం చేకూర్చింది. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రలో వైసీపీ అధికారంలోనికి వస్తాయని కాంగ్రెస్ భావించింది. ఎన్నికల తర్వాత.. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, జగన్ నుంచి మద్దతు తీసుకోవడం జరుగుతుందనేది నాటి కాంగ్రెస్ పాలకుల పన్నాగం. అయితే ఈ విషయం బయటకు లీకైపోయింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులే ఈ విషయాన్ని బయటపెట్టి.. ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. కాంగ్రెస్‌ను పట్టుకుని వేలాడడమంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేయడమేనన్నది ప్రతి ఒక్కరి భావన. అందుకే.. కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది.
కానీ.. జగన్‌కు మాత్రం గత ఎన్నికల ముందు ఈ విషయం అర్థమవ్వలేదు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానన్న కోణంలోనే జగన్ వ్యవహారశైలి కనిపించింది. కాంగ్రెస్‌ను తిట్టడం, విమర్శించడం ఎవరు చేస్తే వారికి ఆంధ్రలో నీరాజనాలు పలికారు. ఆ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి.. రాష్ట్రంలో వైసీపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయినా.. జగన్‌లో మార్పు రాలేదు. ఎంతసేపూ తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్‌ను పరక్షంగా వెనకేసుకొచ్చారు. అందుకే ఆ ఎన్నికల్లో వాస్తవానికి చాలా బలంగా ఉన్నప్పటికీ జగన్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. 66 సీట్లకు పరిమితమైంది. మరో పాతిక సీట్లు వచ్చుంటే.. అధికారం జగన్‌దే అయ్యుండేది. కానీ.. చాలా చోట్ల అతి తక్కువ మెజార్టీతో జగన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
కాంగ్రెస్ పై ఉన్న కోపం జగన్‌పై చూపినా.. ఈ స్థాయిలో సీట్లొచ్చాయంటే.. వైసీపీ గత ఎన్నికల నాటికా చాలా బలంగా ఉందనే అర్థం. పోనీ అయిపోయిందేదో అయిపోయింది.. ఇప్పటికైనా జగన్ తీరు మారిందా.. అంటే అదీ లేదు. ఈ ఎన్నికల ముందు బీజేపీతో అంటకాగుతుండడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ తెగ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మించి నట్టేట ముంచిందనే భావన రాష్ట్ర ప్రజల్లో ఉంది. అలాంటిది ఈ సమయంలో బీజేపీతో ఎవరు కలిసి వెళ్లినా.. మునిగిపోవడం ఖాయం. అందుకే దశాబ్దాల స్నేహాన్ని వదిలేసి.. చంద్రబాబు తీవ్రస్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అలాంటిది.. ఇప్పటివరకూ వ్యతిరేకంగా ఉన్న జగన్ ఇప్పుడు బీజేపీ గూటికి చేరినట్టు అర్థమవుతోంది. రాష్ట్ర మంతా పాదయాత్ర చేస్తూ.. బీజేపీపై ఒక్క విమర్శా చేయడం లేదు. ఎంతసేపూ.. చంద్రబాబును తిడుతూనే కాలక్షేపం చేస్తున్నాడు. దీనిపై ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. జగన్ తీరులో మార్పు లేదు. పైగా.. తాజాగా కాపు రిజర్వేషన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో సెల్ఫ్‌గోల్‌గా మారాయి.
కాపు రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేనందున.. తాను హామీ ఇవ్వనని, కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులను మాత్రం ఇవ్వగలనంటూ జగన్ చెప్పడం.. ఇప్పుడు కాపుల్లో ఆగ్రహజ్వాలల్ని రగిలిస్తున్నాయి. తాను చెప్పిన మాటపై నిలబడతానని.. ఆడిన మాట తప్పననే లెవెల్లోమాట్లాడి మార్కులు కొట్టేయొచ్చని భావించి.. ఉన్నది కాస్త పోగొట్టుకున్నాడు. కాపు కార్పొరేషన్ విషయంలో మాట ఇవ్వలేనని, ఎందుకంటే చెయ్యలేనిది చెప్పే అలవాటు లేదంటూ పెద్ద పెద్ద మాటలనే జగన్ చెప్పాడు. హామీ ఇవ్వలేను అని చెప్పేస్తున్న నీకంటే.. కనీసం ఇస్తానని హామీ ఇచ్చి ప్రయత్నిస్తున్న చంద్రబాబే బెటరంటూ.. ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్లు విరుచుకుపడుతున్నారు. పైగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్రకు వ్యతిరేకంగా కాపులు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతూ.. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈసారి ఈ రకంగా మళ్లీ జగన్ రెండు రకాలుగా సెల్ఫ్‌గోల్స్ తనకు తానే వేసుకున్నాడు. ఈసారి ఇది ఎటు దారితీస్తుందో.. మరో ఆరు నెల్లలో తేలిపోనుంది.
