Sunday, May 5, 2024
- Advertisement -

ఎమ్మెల్యేల వైఫల్యంతో బాధపడిన బాబుకు ఉక్కిరిబిక్కిరయ్యే స్థాయిలో ఆనందాన్ని పంచిన పవన్, రాధాకృష్ణ

- Advertisement -

దేశంలోనే అత్యంత అనుభవజ్ఙుడైన రాజకీయనాయకుడిని, జీవితంలో ఎప్పుడూ తప్పు చేయని నిప్పుని, ప్రపంచానికి పాఠాలు చెప్పినవాడిని అని చెప్పుకునే చంద్రబాబుకు ఆనందం ఎందులో ఉందో తెలుసా? తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జగన్‌ని రాజకీయంగా అంతం చేయడంలో. కానీ ఎలా? 2014లో దేశంలో ఉన్న ఓటర్లందరి మనసూ మెప్పించిన మోడీ అండగా ఉన్నప్పటికీ, నిజాయితీపరుడిని అని ముసుగువేసుకున్న రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్ తోడుగా నిలిచినప్పటికీ…. మీడియా మొత్తం బాబు తప్పుడు హామీలు, తప్పులు కనపడనీయకుండా భజనతో హోరెత్తించినా, మేధావులని ముసుగేసుకున్న వందిమాగధులు, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముంచడంతో పాటు ఉద్యోగ సంఘాలను తప్పుదోవ పట్టించిన ఆరుడుగుల బుల్లెట్టు ఉద్యోగ రాజకీయం చేసినా, సమైక్యాంధ్రకు తీరని ద్రోహం చేసిన కిరణ్ కుమార్‌రెడ్డి లోపాయికారిగా మద్ధతిచ్చినప్పటికీ ఒంటరిగా పోరాటం చేసిన జగన్ కంటే బాబు పార్టీకి మెజారిటీ వచ్చింది ఐదులక్షల పైచిలుకు ఓట్లు. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలతో పాటు, మోడీ ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు అందకుండా చేసిన బాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే 2019లోపే జగన్‌ని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగంగానే ప్రతిపక్ష పాత్ర కూడా తనవాళ్ళే పోషించాలని ఆశపడుతున్నాడు. అయితే టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను పోషించడంలో దారుణంగా ఫెయిల్ అయి బాబులో ఆందోళన రేకెత్తించారు.

అయితేనేం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాత్రం అద్భుతంగా ప్రతిపక్ష పాత్రను కూడా పోషించి బాబుకు ఆనందాన్ని పంచారు. మూడు రోజులుగా పవన్ బాబు షోలో ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగానే కనిపిస్తుంది. కానీ పోలవరం, పడవ ప్రమాదం, ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్యలన్నింటినీ పూర్తిగా సమసిపోయేలా చేయడంలోనూ….ఆ సమస్యలన్నీ పరిష్కారం అవ్వకపోవడానికి ప్రతిపక్ష నాయకుడు జగనే కారణమేమో అన్న అనుమానం జనాలకు వచ్చేలా కూడా చేయడానికి పవన్ విజయవంతంగా ప్రయత్నించాడు. బాబు భజన చేయాలని ఏ స్థాయిలో నిర్ణయించుకుని ఉండకపోతే ఫాతిమా కాలేజ్ విద్యార్థుల గోడు వింటూ ఆ పాపాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేసి ఉంటాడు పవన్. ఇక పవన్ పోషించిన ప్రతిపక్ష పాత్ర కూడా అద్భుతం. అఖిలప్రియను విమర్శిస్తాడు. ఇంకా రెగ్యులర్‌గా బాబు చేతిలో విమర్శలకు గురవుతూ ఉండే టిడిపి నాయకులు అందరినీ విమర్శిస్తాడు. కానీ చంద్రబాబు మాత్రం అత్యంత సమర్థుడు, తప్పులు చేసినప్పటికీ 2019లో కూడా బాబు తప్ప వేరే దిక్కులేదు అని బాబు ప్రభుత్వ వైఫల్యం పుణ్యమాని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు పవన్.

ఇక పవన్ పోషించిన ప్రతిపక్ష పాత్రకు ఈ రోజు రాధాకృష్ణ రాసిన వీకెండ్ కామెంట్ అదిరిపోయే క్లైమాక్స్. పవన్ అత్యంత నిజాయితీపరుడు, తాను కూడా నిజాయితీపరుడినే. పవన్‌కి కుల పిచ్చలేదు. తనకు అసలే లేదు. పవన్ అయినా, నేనయినా కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే, నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్ కష్టపడుతున్నామని భలే రాసుకొచ్చాడు ఆర్కే. ఆ వ్యాసం అంతా కూడా పవన్‌ని విమర్శిస్తున్నట్టుగా కూడా ఉంటుంది. కానీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి, భజన మీడియా టెక్నిక్స్‌పై అవగాహన ఉన్నవారికి మాత్రం భజన చేయడంలో రాధాకృష్ణను కొట్టే జర్నలిస్ట్ తెలుగులో మరొకరు లేరు అన్న విషయం ఇట్టే అర్థమయిపోతుంది.

మచ్చుకి ఒకటి రెండు విషయాలు విశ్లేషిస్తే……పవన్‌కి కులాభిమానం లేదని రాధాకృష్ణ చెప్పాడు. పవన్ ఉత్తరాంధ్ర పర్యటన మొత్తంలో ఎక్కువ పర్యాయాలు ప్రస్తావించిన అంశం ఏంటి? కాపులకు 17శాతం రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేదని కులాభిమానం లేకుండానే అడిగాడా? వంగవీటి రంగా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ మాటల ఆంతర్యం ఒక్కటే 2019నాటికి తన కులం ఓట్లు, బాబు కులం ఓట్లన్నీ కూడా బాబుకు పడేలా చేయడమే. బాబుతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాడు కాబట్టి కాసిన్ని ఓట్లు, సీట్లు తనకు కూడా పడేలా చేసుకుందామన్న వ్యూహం.

ఇక తనకు కులం అంటగట్టరాదని, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజల కోసమే నిబద్ధతో జర్నలిజం వృత్తిని నిర్వహిస్తున్నానని తన గురించి కూడా చెప్పుకున్నాడు రాధాకృష్ణ. ఇదే రాధాకృష్ణ…..ఇదే వీకెండ్ కామెంట్‌లో…….ఆ మధ్య కేసీఆర్ ఆంద్రజ్యోతిని తెలంగాణాలో నిషేధించిన నేపథ్యంలో రాసుకొచ్చిన వ్యాసంలో ఏం రాశాడో తెలుసా? సీమాంద్ర ప్రాంతంలో నష్టపోతానని తెలిసి తెలంగాణా పోరాటానికి మద్ధతిచ్చిన తనను, తన మీడియా సంస్థను నిషేధించడం కేసీఆర్‌కి భావ్యమా అని నిలదీశాడు. మరి ఇది ప్రాంతీయ అభిమానం క్రిందకు వస్తుందో…..రాదో ఆయనే చెప్పాలి. ఇక కెసీఆర్‌తో సయోధ్య నెరపి….కెసీఆర్ భజన చేయడం మొదలెట్టిన తర్వాత రీసెంట్‌గా ఇదే వీకెండ్ కామెంట్‌లో వెల్కం అంటూ మరో వ్యాసం రాసుకొచ్చాడు ఆర్కే. అంటే అర్థమేంటో కూడా ఆయనే ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. తెలంగాణా రాష్ట్రాన్ని వెలమలు, కమ్మలు కలిసి ఏలేలా కులాల వెలమ-కమ్మ కులాల మధ్య అధికారం కోసం సయోధ్య అన్నమాట. ఆ వ్యాసం మొత్తం కూడా రాధాకృష్ణ ఆనందం, ఉత్సాహం మామూలుగా ఉండదు. వెలమలకు, కమ్మలకు అధికరాం అంది పుచ్చుకోవాలంటే ఏం చేయాలో? ఎలా ఉండాలో రెడ్డి కులంతో పాటు ఇతర కులాలేవీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తూ ఎన్నెన్ని రాశాడో. ఇక ఇప్పుడు సీమాంధ్రలో కూడా కాపులు-కమ్మలు కలిసి బాబుకు ఓట్లేసేలా ఎన్ని చేస్తున్నారో?

ఈ రెండు వ్యాసాలు చదివిన తర్వాత కూడా రాధాకృష్ణకు ప్రాంతీయాభిమానం ఉందని, కులాభిమానం ఉందని మనం అనకూడదు. ఇక వైఎస్‌లను ఆదరిస్తున్నందుకు రాయలసీమను, రెడ్డి కులస్తులను రాధాకృష్ణ ఏ స్థాయిలో విమర్శించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రాధాకృష్ణ భజన ఎవరి కోసమో కూడా ప్రత్యేకంగా చెప్పాలా?

పవన్, రాధాకృష్ణల షో చూశాక మాత్రం చంద్రబాబు అమితానందపడిపోయి ఉంటాడు. విమర్శించుకున్నట్టు కనిపిస్తూ కూడా ఒకరినొకరు ఏ స్థాయిలో పొగుడుకోవచ్చో భలే సినిమా చూపించారు మరి. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ టైంకి ముందుగా ఈ ఇద్దరి చేతా టిడిపి ఎమ్మల్యేలకు భజన క్లాసులు పెట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఐడియా బాబుకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -