Saturday, May 11, 2024
- Advertisement -

అత్యద్భుతం.. అనితర సాధ్యం

- Advertisement -

విరాట్.. విరాట్.. విరాట్. ఎన్నిసార్లు పలికినా.. ఇంకా ఇంకా పలకాలని.. ఓ నినాదంలా ఎలుగెత్తాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఆ స్థాయిలో ఆస్ట్రేలియాను పరుగులు పెట్టించి.. తన బ్యాటింగ్ వీర విహారంతో కంగారు పెట్టించి.. తనకే సాధ్యమైన పెను తుపానును రుచి చూపించి.. సెమీస్ కు ఇండియాను సగర్వంగా చేర్చిన విరాట్ కోహ్లీని చూసి.. ప్రతి భారతీయుడు కాలరెగరేసి మరీ.. గర్వపడుతున్నాడు. చివరి 2 ఓవర్లలో విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో.. కోహ్లీ చూపిన తెగువను.. మళ్లీ మళ్లీ తలుచుకోకుండా ఏ అభిమానీ ఉండలేకపోతున్నాడు. ఆడింది 51 బాల్సే అయినా.. 9 ఫోర్లు.. 2 సిక్సర్లతో విధ్వంసం అంటే ఏంటో రుచి చూపించి.. టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా జట్టును తన బ్యాటుతో గెంటేసిన కోహ్లీని చూసి.. జయహో కోహ్లీ అని నినదిస్తున్నాడు.

క్వార్టర్స్ కాని క్వార్టర్స్ మ్యాచ్ లో.. మాటల్లో చెప్పలేని స్థాయిలో.. అద్భుత ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించాడు.. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన ఆటలో.. కష్ట సమయంలో ఇష్టంగా ఆడుతూ.. ఆసీస్ ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టి.. భారత జట్టుకు అనితర సాధ్యమైన విజయాన్ని అందించాడు.. కోహ్లీ. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. 20 ఓవర్లలో 160 పరుగుల మంచి స్కోరు సాధించింది.

తర్వాత 20 ఓవర్లకు 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియాను.. ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మ నిరాశపరిచారు. ఈ దశలో మళ్లీ భారత్ కు విరాట్ కోహ్లీనే దిక్కయ్యాడు. ఓ పక్క సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ ఔటైనా.. ఏ మాత్రం ఆత్మ విశ్వాసం పోగొట్టుకోకుండా.. అద్భుతమైన మానసిక స్థైర్యంతో ఆడుతూ.. వీలు చిక్కిన బంతినల్లా బౌండరీ దాటిస్తూ.. లక్ష్యాన్ని చిన్నది చేశారు. 19వ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు బాది.. టీమ్ ఇండియాను విజయం ముంగిట నింపాడు. చివరగా.. విన్నింగ్ షాట్ తో.. కెప్టెన్ ధోనీ.. మ్యాచ్ ను ముగించాడు.

పేరుకు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయినా.. ఆసీస్ వర్సెస్ కోహ్లీ అన్నట్టుగా మ్యాచ్ జరిగింది. 2 జట్లలో తేడా ఏంటి అన్న ప్రశ్న వస్తే.. కోహ్లీనే అని చెప్పేంతగా బ్యాటింగ్ తో దడదడలాడించాడు.. విరాట్. అందుకే.. ఈ మ్యాచ్ గురించి రాయాలన్నా.. మాట్లాడుకోవాలన్నా.. ఒక్క విరాట్ కోహ్లీ గురించే అయి తీరాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -