భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. డోపింగ్ పరీక్షల్లో విఫలమవడంతో బీసీసీఐ అతనిపై 8 నెలల పాటు నిషేధం విధించింది. అయితే దీన్ని తాజాగా కాకుండా పాత తేదీ (మార్చి 16)తో విధించడం వల్ల వచ్చే నవంబర్ 15వ తేదీతో ఈ నిషేధం ముగుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోర్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన షా తీవ్రమైన దగ్గుతో ఇబ్బందులు పడ్డాడు. అయితే టీం మేనేజ్‌మెంట్, డాక్టర్ సలహా తీసుకోకుండానే టర్బుటలైన్ అనబడే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న ఓవర్ ది కౌంటర్ కాఫ్ సిరప్‌ను షా సేవించాడు.
మ్యాచ్ సందర్భంగా డోప్ పరీక్షల కోసం షా మూత్ర శాంపిల్స్‌ను బీసీసీఐ యాంటీ డోపింగ్ విభాగం సేకరించింది. ఈ క్రమంలో జరిపిన డోప్ టెస్టులో షా విఫలమయ్యాడు. దీంతో అతనిపై బీసీసీఐ ఇప్పుడు చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు నిషేధం విధించింది. ఈ క్రమంలో షా టీ20, వన్డే, టెస్టులు.. తదితర ఏ ఫార్మాట్‌లోనూ ఆడకూడదు. దీనిపై షా కూడా స్పందించారు. ఇదంతా తన తలరాతని, దానిని పూర్తిగా గౌరవిస్తానన్నాడు.
షాతో పాటు మరో ఇద్దరు జూనియర్ క్రికెటర్లు అక్షయ్, దివ్య గజ్‌రాజ్‌లకు కూడా ఇదే విధమైన నిషేధానికి గురయ్యారు. షా తీసుకున్న దగ్గుమందులో నిషేధిత టెర్బుటలైన్ అనే ఉత్ప్రేరకం ఉంది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉంది. షా తన తప్పును ఒప్పుకున్నాడని అందుకే అతనిపై 8 నెలల పాటు మాత్రమే నిషేధం విధించామని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
