తెలంగాణలో కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ డాక్టర్లకు సూచించారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి డిఎంఇ రమేశ్‌రెడ్డి జూడాలు చర్చలు జరిపారు. ఈమేరకు ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచగా, వాటిని అధికారులు తిరస్కరించారు. కరోనాతో చనిపోయిన హెల్త్ వర్కర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డాక్టర్లు కోరగా, కేంద్రం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాతో సరిపెట్టుకోవాలని డిఎంఇ చెప్పినట్లు జూడాలు వివరించారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని, ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సిఎం స్పష్టం చేశారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సిఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కొవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సిఎం నిర్ణయించారు. ఇక బుధవారం ప్రగతి భవన్లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే.. గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రిలోజూనియర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు. కోవిడ్ పేషేంట్లకు వైద్యం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు పేర్కొన్నారు. డిఎంఇతో జరిగిన చర్చల్లో ఉస్మానియా జూడా ప్రెసిండెట్ డాక్టర్ రాహుల్, జనరల్ సెక్రటరీ, డాక్టర్ సాగర్, డాక్టర్ లక్షీ, డాక్టర్ శ్రీకాంత్, గాంధీ జూడా ప్రెసిడెంట్ మణికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30న కేబినెట్ భేటీ.. లాక్డౌన్ పొడిగింపు?
