ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ మరియు మెరుగైన పరిపాలన లక్ష్యంగా, ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కొత్త జిల్లాలతో పాటు, రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కొత్త జిల్లాల వివరాలు:
మార్కాపురం (కేంద్రంగా మార్కాపురం)
మదనపల్లె (కేంద్రంగా మదనపల్లె)
పోలవరం జిల్లా (కేంద్రంగా రంపచోడవరం)
ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి మరియు పరిపాలన సౌలభ్యం కోసం రంపచోడవరం కేంద్రంగా ఈ పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.జిల్లాల పునర్విభజనపై ఇటీవల చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా, అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రెవెన్యూ డివిజన్లు
నక్కపల్లి
అద్దంకి
పీలేరు
బనగానపల్లె
మడకశిర
కర్నూలు జిల్లాలోని పెద్దహరివనం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
