తిరుపతి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడిపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో స్కానింగ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డి, విజయవాడకు చెందిన పృథ్వీ అనే భక్తుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్శనానికి వచ్చిన సమయంలో చిన్నపాటి మాటల తేడా తలెత్తగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన భద్రతా సిబ్బందే భక్తుడిపై చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనలో తాను అన్యాయంగా దాడికి గురయ్యానని భక్తుడు పృథ్వీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆలయానికి ప్రశాంతంగా దర్శనానికి వచ్చిన తనను హెడ్ కానిస్టేబుల్ అవమానించడంతో పాటు భౌతికంగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో టీటీడీ భద్రతా సిబ్బంది సహనం కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇలాంటి ఘటనలు తిరగరాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
