- Advertisement -

పార్టీ మారారు..ఓటర్లు బుద్ధి చెప్పారు!

- Advertisement -

తెలంగాణలో జరిగిన తాజా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మారిన నేతలకు ఓటర్లు గట్టి సందేశం ఇచ్చారు. అధికారాన్ని అనుభవించి తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారిన నాయకులను ప్రజలు తిరస్కరించిన తీరు స్పష్టంగా కనిపించింది.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ పదవి నిర్వహించిన మల్లెల రాజశ్రీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 9వ వార్డులో పోటీచేశారు. అయితే ఆమెకు ప్రజలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి రవి నీలం 75 ఓట్ల మెజారిటీతో రాజశ్రీపై విజయం సాధించారు. పార్టీ మార్పును ఓటర్లు అంగీకరించలేదనే సందేశం ఈ ఫలితంతో వెల్లడైంది.

గజ్వేల్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. 2014 నుంచి 2020 వరకు బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన గాడిపల్లి భాస్కర్ తర్వాత బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీ తరఫున తన భార్య గాడిపల్లి కళ్యాణిని బరిలో నిలబెట్టగా, బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత 529 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేసినా ఫలితం మారలేదు.

చౌటుప్పల్ మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి చైర్మన్ పదవి అనుభవించిన వెంరెడ్డి రాజు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి తన భార్య సంధ్యను 16వ వార్డులో పోటీకి దించారు. అయితే ఆమెను ప్రజలు 374 ఓట్ల తేడాతో ఓడించారు.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో కూడా పార్టీ మారిన నేతలకు ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మాజీ చైర్మన్ మామిండ్ల కృష్ణా జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్‌కు ఓటర్లు తిరస్కారం తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల రాములు చేతిలో నందాల రాధిక శ్రీనివాస్ 311 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే చెలిమెల ప్రియాంక (రఘుపతి) చేతిలో మామిండ్ల కృష్ణా జ్యోతి 64 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

మొత్తంగా, ఈ ఎన్నికలు పార్టీ మార్పులను ప్రజలు ఎంతగా గమనిస్తున్నారో స్పష్టం చేశాయి. స్థానిక అభివృద్ధి, నిబద్ధత, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఓటర్లు తమ తీర్పుతో తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -