తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించి, తన పట్టును నిరూపించుకున్నారు. తమిళగ వెట్రి కజగం (TVK) నేతృత్వంలోని ప్రభుత్వం సుస్థిరంగా ఉందని ఈ ఫలితం స్పష్టం చేసింది.
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ముఖ్యమంత్రి విజయ్‌కు అనూహ్య మద్దతు లభించింది. మొత్తం 144 మంది సభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువే మద్దతు కూడగట్టడంతో విజయ్ పీఠం సుస్థిరమైంది.
విజయ్‌కి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితా..TVK (తమిళగ వెట్రి కజగం): 106,కాంగ్రెస్: 05,సీపీఐ (CPI): 02,సీపీఎం (CPM): 02,వీసీకే (VCK): 02,
ఐయూఎంఎల్ (IUML): 02,ఏఎంఎంకే (AMMK): 01 ఉన్నాయి.
ఈ బలపరీక్షలో అత్యంత కీలక పరిణామం అన్నాడీఎంకే (AIADMK) లోని అంతర్గత విభేదాలు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) విప్ జారీ చేసినప్పటికీ, సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు చేసింది. షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అనుకూలంగా ఓటు వేశారు.ఈ పరిణామం అన్నాడీఎంకేను కోలుకోలేని దెబ్బ తీయగా, విజయ్ ప్రభుత్వానికి భారీ బలాన్ని ఇచ్చింది.
